- – నిత్యం యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యం
- – అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్రెడ్డి
- – కొత్తపల్లిలో ఘనంగా ‘అల్ఫోర్స్ హైస్కూల్ యోగా ఉత్సవ్’
నేటి సాక్షి, కరీంనగర్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించడానికి ఎంతో కృషి చేస్తున్నారని, వివిధ రకాల ప్రక్రియలను అమలు చేస్తున్నారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హైస్కూల్లో ఎన్సీసీ సమన్వయంతో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి వ్యక్తి ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా జీవితాన్ని గడపాలనుకుంటారని, దానికి ఎటువంటి అవరోధాలు లేకుండా చూసుకోవాలని సూచిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ఆరోగ్య సమాజం కోసం చేయూతనిచ్చి ముందంజలో ఉండాలని తెలిపారు. నేడు ప్రపంచంలో చాలా మంది రోగాల బారిన పడుతున్నారని, దీనికి ప్రధాన కారణం వ్యాయమం, యోగా చేయకపోవడమని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాను సాధన చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. యోగా ద్వారా ప్రతి ఒక్కరు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడం ద్వారా ఉద్యోగాన్ని కొనసాగిస్తూ చక్కగా జీవితాన్ని కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. దేశ ప్రధాని 2014లో చేసిన ప్రతిపాదనను 2015లో ఐక్యరాజ్యసమితి ఆమోదిచి, 21 జూన్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించడం ద్వారా దేశ సనాతన ధర్మాలకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టినట్లయిందని చెప్పారు. ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విధిగా యోగాను రోజువారి విధిగా నిర్వర్తించి దురలవాట్లకు దూరంగా ఉండి పర్యావరణానికి హితంగా మెదిలి ఉండాలని సూచిస్తూ ప్రత్యేకంగా యువత ఎటువంటి వ్యసనాలకు బానిస కాకుండా వివిధ యోగా ధర్మాలను రోజుకు కనీసం గంటపాటు పాటించి ఆరోగ్యంగా జీవించడానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలని సూచించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులకు పలు ఆసనాల విశిష్టతను యోగా గురువు ద్వారా తెలియజేశారు. విద్యార్థులు ఆలపించినటువంటి “యోగా ఒక సాధన యోగా ఒక జీవితం”, “యోగానే ఆరోగ్యానికి శ్రీరామరక్ష” గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యోగా ఉత్సవాలు అల్ఫోర్స్ విద్యాసంస్థల్లోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఎన్సీసీ క్యాడెట్స్ పూజశ్రీ, సూర్యప్రకాశ్, యోగా శిక్షకులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.