నేటి సాక్షి, రాజేంద్రనగర్: తాను కొనుగోలు చేసిన భూమిలో ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చివేయడంతో రెవెన్యూ అధికారులపై స్థల యజమాని, మాజీ కార్పొరేటర్ మిత్ర కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సరైన రీతిలో పత్రాలను పరిశీలించకుండా ఇష్టారాజ్యంగా వ్యవరించిన అధికారులపై కోర్టు ద్వారా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. గండిపేట మండలం గంధంగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిత్రకృష్ణ వివరాలను వెల్లడించారు. గంధంగూడలో సర్వే సంబర్ 51లోని 9 ఎకరాల 36 గుంటల భూమిని 2012లో తాను ముస్లింలు, కౌలుదారులైన గ్రామస్తుల నుంచి భూమి కొన్నట్టు చెప్పారు. అనంతరం మ్యూటేషన్ కావడంతో పాటు పట్టదార్ పాస్బుక్ కూడా మంజూలైనట్లు తెలిపారు. దీంతో ఆ స్థలంలో రేకుల షెడ్లు వేశామన్నారు. కాగా, రెవెన్యూ అధికారులు స్థలానికి చెందిన రికార్డులను పరిశీలించకుండా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారని వాపోయారు. ముంతకాబ్లో కూడా సక్రమంగానే ఉన్నా అధికారులు అవేమి పట్టించుకోలేదని అన్నారు. తాము నిర్మించిన షెడ్లను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా, స్టేటస్కో ఆర్డర్ వచ్చిందని తెలిపారు. తాను డబ్బులు చెల్లించి భూమిని కొనుగోలు చేస్తే, అధికారులు తనపై తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు.

