– రైతుల అభిప్రాయం మేరకే రైతు భరోసా అందిస్తాం..
– అన్నదాతల సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం
– అందరితో చర్చించే తగిన నిర్ణయం
– రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
– వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి అభిప్రాయ సేకరణ
– తిమ్మాపూర్‌లో కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి
నేటి సాక్షి, కరీంనగర్: రైతుల సూచనలను పరిగణనలోకి తీసుకొని, వారి అభిప్రాయం మేరకే రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు భరోసా పథకంపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నుంచి కలెక్టర్ పమేలా సత్పతి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు, రైతు సంఘాలు, ప్రతినిధులు అందరితో చర్చించే రైతు భరోసాను అర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌ను రైతులు నమ్మవద్దని సూచించారు. అందరితో చర్చించి మంత్రివర్గ ఉపసంఘానికి రైతు భరోసా పథకం అమలుపై నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో రైతులు రాతపూర్వకంగా కూడా అభిప్రాయాలు చెప్పవచ్చని తెలిపారు. అభిప్రాయ సేకరణ వల్ల ఈసారి రైతు భరోసా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతు న్నామని చెప్పారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కష్టమైన రైతులకు రెండు లక్షల రుణ రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుబంధును ఇస్టాసారంగా అమలు చేసిందని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా నేతలు, పడవు బడ్డ భూములు, గ్రామాల్లో భూమి ఉండి హైదరాబాద్ లో నివసించే వారికి సైతం పెట్టుబడి సాయం అందించిందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం రైతు భరోసా దుర్వినియోగం కాకుండా అసలైన రైతుకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, రైతు శిక్షణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ చత్రు నాయక్, ఏడిఏ అంజని, తిమ్మాపూర్ తహసిల్దార్ కనుకయ్య, ఏవో సురేందర్ రెడ్డి, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పదేకరాల వరకు రైతు భరోసా అందించాలి.. : మోరపెల్లి రమణారెడ్డి, రైతు, మొగిలిపాలెం
పది ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని మొగిలిపాలెం గ్రామానికి చెందిన మోరపల్లి రమణారెడ్డి అనే రైతు కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బీఆర్ఎస్ సర్కారు అందించిన తీరు లాగా కాకుండా నిజమైన రైతులకు న్యాయం జరిగేలా పెట్టుబడి సాయం అందించాలని పేర్కొన్నారు. పంటల సాగుకు ఉపయోగపడేలా ఎప్పటికప్పుడు సీజన్ ముందు 7500 రైతు భరోసా అందించాలని కోరారు. రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఐటీతో సంబంధం లేకుండా రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని సూచించారు. రైతులకు నిరంతరం కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నదని తెలిపారు.