- – వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం
- – కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాల మేరకే ఫ్లైయాష్ తరలింపు
- – కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్
నేటి సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పద్ధతి మార్చుకోవాలని, వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్యాల సుజిత్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుగుదలను చూసి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రామగుండం ఫ్లైయాష్ తరలింపుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌పై కౌశిక్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఫ్లైయాష్ లారీల్లో ఓవర్ లోడ్‌తో వెళ్తున్నదని, ఇందులో మంత్రి పొన్నం అవినీతికి పాల్పడుతున్నారని నిరాధార ఆరోపణలు చేస్తూ పొన్నం పరువుకు భంగం కలిగిస్తున్నాడని పేర్కొన్నారు. రామగుండం ఎన్టీపీసీ నుంచి వచ్చే ఫ్లైయాష్, బాట్ యాష్ 100శాతం ప్రజా అవసరాలకు బయటకి తరలించడానికి కేంద్ర పర్యావరణ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందని, అందుకు టెండర్లు పిలిచి, ఉచితంగా ఫ్లైయాష్ ఇస్తారని చెప్పారు. ఫ్లైయాష్‌ను రోడ్ల నిర్మాణం, బ్రిక్స్ తయారీ లాంటి వాటికి ఉపయోగిస్తారని, దీని తరలింపును ఎన్టీపీసీనే చూసుకుంటుందని చెప్పారు. అయితే ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఫ్లైయాష్‌తో వెళ్తున్న లారీలను రోడ్డుపై నిలిపివేసి, హెవీ లోడ్‌తో లారీలు వెళ్తున్నాయని, దీనిలో మంత్రి పొన్నం ప్రమేయం ఉందని వ్యక్తిగత కక్షతో ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమ ఇసుక తరలింపు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం.. ఇసుక మాఫియాను అరికట్టడంలో విఫలమైన సంబంధిత శాఖలు గోదావరి రివర్ మేనేజ్మెంట్కు రూ.25 కోట్లు చెల్లించాలని, మూడు శాఖలకు జరిమానా విధించిన విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించామని చెప్పారు. ఈ తీర్పు అనంతరం నియోజకవర్గంలో ఇసుక తరలింపు నిలిపి వేయడంతో అవినీతి సొమ్ముకు అలవాటు పడిన కౌశిక్ రెడ్డి, అక్రమ ఆదాయం ఆగిపోవడంతో అక్కసుతో, ప్రజాధనాన్ని కాపాడాలని సమర్ధవంతమైన పరిపాలన నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బురదజల్లే ప్రయత్నంలో భాగంగానే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఫ్లైయాష్ ఓవర్ లోడ్ విషయంలో ఎన్టీపీసీ మార్గదర్శకాల మేరకే లారీల్లో తరలిస్తున్నామని, ఓవర్ లోడ్‌తో వెళ్లడం వల్ల లారీలు టైర్లు పాడవడం, ప్రమాదం జరగడం వంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని లారీ యజమానులు స్పష్టం చేశారని చెప్పారు.
ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని, జూబ్లీహిల్స్ మాదాపూర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అతని గురించి కాంట్రాక్టర్లు ఎలా మాట్లాడుకుంటున్నారో వాస్తవాలు తెలుసుకోవాలని, అతని నియోజకవర్గంలో అతను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వీణవంక జమ్మికుంట హుజూరాబాద్ మండలాల్లో కాంట్రాక్టర్లతో అభివృద్ధి పనులు చేయించుకొని ముడుపులు ఇస్తే తప్ప బిల్లులు ఇవ్వలేమని వారిని ఎంతటి ఇబ్బందులకు గురిచేశావో నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. తన కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి రాజకీయాలు చేసిన వ్యక్తి కౌశిక్‌రెడ్డి అని, ఎన్నికల సమయంలో అతని కూతురుతో నియోజకవర్గం అభివృద్ధికి వంద కోట్లు తెప్పిస్తానని చెప్పించి ప్రజలను నమ్మించి మోసం చేయలేదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల వద్ద ఎలాంటి ముడుపులు తీసుకోలేదని అతని కూతురు బహిరంగంగా చెప్పగలదా? ఆ రోజు ఎన్నికల ప్రచారంలో నాటకాలు ఆడిన ఆయన సతీమణి.. నేడు తన భర్త నిజాయితీపరుడని నియోజకవర్గ ప్రజలకు చెప్పగలదా? అని ప్రశ్నించారు. మరోమారు మంత్రిపై నిరాధార ఆరోపణలు చేస్తే, తగిన రీతిలో సమాధానం చెప్పి తీరుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పొన్నం మధు, మాజీ కార్పొరేటర్ పడిషెట్టి భూమయ్య, నగర కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుర్ర పోషయ్య, కాంగ్రెస్ నాయకులు దీకొండ శేఖర్, అనీల్, అమెర్, గంగుల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.