- కన్నుల పండుగ సాగిన గణపతి హోమం, అభిషేక పూజలు
- అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలోని మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్య క్షేత్రం మహాశక్తి దేవాలయంలో మంగళవారం అంగారక సంకటహర చతుర్థి వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి వారి దివ్య ఆశీస్సులతో వేద పండితుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం చేపట్టిన గణపతి హోమం, సాయంత్రం సంకటహరచతుర్థి వ్రతం, అభిషేక పూజలు, భజన కార్యక్రమాలు కన్నుల పండుగ సాగాయి. ఎంతో విశిష్టత కలిగిన అంగారక సంకటహర చతుర్థి వేడుక మహోత్సవాన్ని దేవాలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించడంతో అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా వేదపండితులు అంగారక సంకటహర చతుర్థి విశిష్టతను భక్తులకు తెలియజేశారు. దేవుళ్లందరిలో వినాయకుడే ప్రథమ పూజలు అందుకుంటారని, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా, ఏదైనా మంచి పని చేయాలన్నా ముందుగా గణేశుడినే పూజిస్తామని చెప్పారు. విఘ్నలన్ని తొలగించి మనం చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యేలా వినాయకుడు ఆశీర్వదిస్తాడని చాలామంది విశ్వాసమన్నారు. ముఖ్యంగా సంకష్టహర చతుర్థికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సంకట చతుర్థి అనేది ప్రతి చంద్ర మాసంలో వచ్చే వినాయకుడి ఉత్సమని, తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో పౌర్ణమి తిథి తర్వాత వచ్చే చవితి రోజున చతుర్థి వస్తుందని, ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అంటారని తెలిపారు. అంగారకి సంకటహర చతుర్ధి అన్ని సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైందన్నారు. సంకష్టహర చతుర్థి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటంవల్ల వినాయకుని అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారని, అంతేకాకుండా తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిస్తాడని, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలామంది విశ్వాసం, అందుకే ఈ రోజున ఉపవాసం ఈ సందర్భంగా భక్తులకు సంకష్ట విశిష్టతను వేద పండితులు వివరించారు. అనంతరం రాత్రి చంద్రోదయం తరువాత భక్తులకు ఆలయ నిర్వాహకులు దేవాలయం వద్ద అన్నప్రసాద వితరణ చేశారు.