నేటి సాక్షి, కరీంనగర్: ఉద్యోగుల బదిలీల కోసం నిషేధ ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో 80 జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రభుత్వ అధ్యాపక సంఘ మైనార్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ జబీ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరికొన్ని సమస్యలను పరిశీలించి అందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ విద్యా శాఖలో పని చేస్తున్న జూనియర్ అధ్యాపకులు గతేడాది రెగ్యులరైజ్ కావడంతో వీరి సర్వీసు కేవలం ఒకే సంవత్సరం దాటడంతో ప్రస్తుత బదిలీల జీవో ప్రకారం బదిలీల కోసం అవకాశం కలగదని, దీంతో వేల మంది అధ్యాపకులు మానసిక ఆవేదన చెందుతున్నారని చెప్పారు.
రెగ్యులరైజేషన్ జరగక ముందు నుంచి దాదాపు 16 ఏండ్లుగా ఒకే చోట పని చేస్తున్న విషయాన్ని మానవత దృక్పథంతో ఆలోచించాలని కోరారు. కుటుంబం, తల్లిదండ్రులకు దూరంగా, భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తూ పిల్లలకు దూరంగా ఉంటూ నరకయాతన పడుతున్న విషయాన్ని గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, హామీ ఇచ్చి, న్యాయం చేయలేదని వాపోయారు. కనీసం కాంగ్రెస్ హయాంలోనైనా ఇది నెరవేరుతుందని ఆశపడ్డ వారందరూ నిరాశలో ఉన్న విషయాన్ని పరిశీలించి, సీఎం రేవంత్రెడ్డి అందరికీ న్యాయం జరిగేలా కనీసం ఒక సంవత్సర సర్వీసు కాలాన్ని లేదా పాత సర్వీసు కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు ఆదేశించి, అందరికీ బదిలీలు జరిగేలా చూడాలని యావత్ తెలంగాణ జూనియర్ అధ్యాపకుల ఆవేదనను మైనార్టీ సంఘ తరపున విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.