నేటి సాక్షి, కరీంనగర్: ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ప్రజలు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆవిష్కరణలు పంపించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. తద్వారా చక్కని ఆవిష్కరణలతో కరీంనగర్‌కు మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతేడాది కరీంనగర్ జిల్లా నుంచి 100 ఆవిష్కరణలు వచ్చాయని తెలిపారు. ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువగా ఆవిష్కరణలు చేయాలని సూచించారు. ఇందుకు వయసుతో నిమిత్తం లేదని, విద్యార్థులు, యువత, వృద్ధులు ఎవరైనా ఏ సమస్య పైన అయినా ఆవిష్కరణ చేయవచ్చని పేర్కొన్నారు. ఆవిష్కరణలు ఆగస్టు 3వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఆవిష్కరణలకు సంబంధించిన నాలుగు ఫోటోలు, 100 పదాలు, రెండు నిమిషాలు నిడివి గల వీడియో ఆవిష్కరణ పేరు, సెల్ నెంబరు, వృత్తి, పూర్తి వివరాలు 9100678543 వాట్సాప్ నంబర్ కు పంపించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, ఈడియం శ్రీరామ్ శ్రీనివాస్ రెడ్డి, ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా కోఆర్డినేటర్ మణిదీప్, అధికారులు పాల్గొన్నారు.