నేటి సాక్షి, హైదరాబాద్: ఏసీబీ పేరిట కొందరు దుండగులు ఎంపీడీవోకే కుచ్చుటోపి పెట్టారు. ఈజీ మనీ కోసం నకిలీ ఏసీబీ ఆఫీసర్లుగా మారారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఎంపీడీవోగా పని చేస్తున్న బండి లక్ష్మప్పను బురిడి కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా, సర్వత్రా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని, కేసు నమోదు అవుతుందని కేటుగాళ్లు ఎంపీడీవోకు ఫోన్ చేశారు. తమకు రూ. లక్షలు ఇస్తే, కేసు కాకుండా చూస్తామని బెదిరించారు. దీంతో ఎంపీడీవో వారికి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రూ.5 లక్షలు పంపారు.
ఎంపీడీవో స్వగ్రామం తాండూర్ పట్టణం కావడంతో తన దగ్గర డబ్బులు కాజేశారని గత నెల 20న తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఇద్దరు నిందితులను మహబూబ్‌నగర్‌లో పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.50వేల నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటన వివరాలను తాండూరు పీఎస్‌లో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విలేకరులకు వివరించారు. ఎంపీడీవోను మోసం చేసిన వారు తరుణ్ గౌడ్, ముజాహిద్, నూతేటి జయకృష్ణ అని గుర్తించినట్టు చెప్పారు. తరుణ్‌గౌడ్, ముజాహిద్‌ను అరెస్టు చేశామని పేర్కొన్నారు.
జయకృష్ణ పరారీలో ఉన్నట్టు తెలిపారు. జయకృష్ణపై రెండు తెలుగు రాష్ట్రాల్లో 31 కేసులతోపాటు శంషాబాద్, సిద్దిపేటలో ఏసీబీ అధికారులు అని చెప్పి మోసం చేసిన మూడు కేసులు ఉన్నట్టు చెప్పారు.