ఓ తల్లి తన పిల్లల కోసం ఎంతటి సాహసం అయినా చేస్తుంది. ఎంత దూరమైనా వెళ్తుంది. చివరికి ప్రాణ త్యాగానికైనా సిద్ధమవుతుంది. ఇలా తల్లి చేసిన సాహసాలు మనం చాలా చూశాం. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఓ వీడియో వైర్ అవుతున్నది. బయట హోరు వర్షం.. బిలంలో తన సంతానం.. నీళ్లు లోనికి చేరగా, ఆ పిల్లలను కాపాడేందుకు ఓ తల్లి ఎలుక చేసిన సాహసం తల్లి ప్రేమ ఎంత గొప్పదో వర్ణిస్తున్నది. జంతువైనా, పక్షులైనా, మనుషులైనా తల్లి తల్లే అంటూ నెటీజన్లు పేర్కొంటున్నారు. 2.20 నిమిషాల వీడియో అందరిని ఆలోచింపజేస్తున్నది.
– వీడియో ఏముందంటే..
బయట వర్షం జోరుగా పడుతున్నది. ఓ ఎలుక వేగంగా తన బిలంలోకి వెళ్లి, ఓ పిల్లను బయటికి తెచ్చి, సేఫ్ ప్లేస్లో ఉంచుంది. అంతలోనే బిలంలోకి కాలువలా నీళ్లు వెళ్తున్నా, తల్లి ఎలుక తన ప్రాణాలను లెక్క చేయకుండా నీళ్లతో పాటు బిలంలోకి వెళ్లింది. తన మరో పిల్లను తీసుకొచ్చింది. ఇంకో పిల్లలను తీసుకొచ్చేందుకు మళ్లీ బిలం వైపు వెళ్లగా, అప్పటి కంటే మరింత నీటి ప్రవాహం పెరిగింది. అయినా ఆ తల్లి ఎలుక తన ప్రాణాలను లెక్క చేయలేదు. బిలంలోకి దూరి, మరో పిల్లను బయటికి తీసుకొచ్చింది.
ఈ వీడియోలో అనుక్షణం నీటి ప్రవాహం పెరుగుతూ సస్పెన్స్ సినిమాను తలపించింది. మొత్తానికి తన పిల్లలను ఆ తల్లి ఎలుక కాపాడుకుంది. తర్వాత ఊపిరి పీల్చుకుంది. ఈ వీడియోను 2020లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కాస్వాన్ అప్లోడ్ చేయగా, ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నది.

