Monday, December 23, 2024

రక్త సింధూరం!

దేశంలో మహత్తర నక్సల్బరీ సాయుధ రైతాంగ తిరుగుబాటు నుంచి మొదలుకొని గత అర్దశతాబ్ధానికి పైగా కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ క్రమంలో పార్టీ సంస్థాపకులు, ఉపాధ్యాయులు, భారత విప్లవోద్యమ మహా నాయకులు, అమరులు కామ్రేడ్స్ చారుమజుందార్.. కామ్రేడ్ కన్హాయ్ ఛటర్జీలు.. రూపొందించిన దీర్ఘకాల ప్రజాయుద్ధ మార్గంలో లక్ష్య సాధన కోసం పోరాడుతూ నులివెచ్చని నెత్తుర్లు ధార పోసి, వేనవేల మంది కామ్రేడ్స్ అమరులయ్యారు! అలుపెరుగని పోరుబాటలో నేలతల్లి ఒడిలో ఒరిగిన ‘అమరవీరులకు’ జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు ‘సంస్మరణ వారోత్సవాలు’ నిర్వహించనున్నట్టు ‘మావోయిస్టులు’ ప్రకటించారు.!


– తొలి ‘పొద్దు పొడిచింది’!…..
ఏప్రిల్ 17-2017న నక్సల్బరీ మొదటి తరం నాయకుడు సీపీఐ(మావోయిస్టు) పోలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ నారాయణ సన్యాల్ అనారోగ్యంతో అమరుడ‌య్యాడు. భారత విప్లవ మార్గదర్శకుల పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్స్ చారుమజుందార్ 1972 జూలై 28న, కామ్రేడ్ కన్హాయ్ చట్టార్టీ 1982 జూలై 18న అమరులయ్యారు. ఈ ఇద్దరు నాయకులు సాయుధ పోరాటాన్ని ప్రజాయుద్దాన్ని దేశ రాజకీయ ఎజెండా మీదికి తెచ్చారు. సాయుధ పోరాటం దేశంలో ఎజెండా మీదికి వచ్చినప్పటి నుంచి దేశ రాజకీయ రంగంలో పెను మార్పులు జరిగాయి. విప్లవోద్యమ పురోగమన క్రమంలో కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో నుంచి సాధారణ పీడిత ప్రజల వరకు అనేక మంది కామేడ్స్, వీరయోధులు వీరవనితలు అమరులయ్యారు.


– అమరుల త్యాగాలకు నివాళి
ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరుల మహెూన్నత త్యాగాలను స్మరిస్తూ వారి ఆశయ సాధనకు అంకితమవ్వాలని జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు స్మరించుకోవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
– భూస్వాములు గుండెల్లో రైళ్లు
భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించిన నక్సలైట్లు ఊళ్లోకొస్తున్నారంటే అప్పట్లో ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభించేది. వేధించుకు తినేవారిని, అత్యాచారాలను చేసేవారిని, దాష్టికానికి ఒడిగట్టే వారిని, ప్రజాకోర్టులో శిక్షించేవారు. భూస్వాముల గిడ్డంగుల్లో దాచుకున్న ఆహార ధాన్యాన్ని కరువుదాడులు చేసి బడుగు జీవులకు పంచిపెట్టేవారు. మా కోసం ‘అన్నలున్నారన్న’ గుండెధైర్యంతో ఎండిన కడుపులు నింపుకునేవారు.
– కడుపులో పెట్టుకుని కాపలా.!
కాలే కడుపులు నింపిన అన్నలకు ఆదివాసీలు, హరిజన, గిరిజన, తాడిత, పీడిత జనాలు ప్రాణాలు పణంగా పెట్టి కడుపులో పెట్టుకుని కాపాడుకునేవారు. ఆశ్రయమిస్తున్నరన్న నెపంతో కేసులు పెట్టినా, చితకబాదినా, కాల్చి చంపినా కళ్లలో పెట్టుకుని కాపలా కాసేవారు.
– పాటలతో కదనరంగంలోకి..
చెమట చుక్కల పరిమళం.. కాలేకడుపుల ఆర్తనాదాలు.. భూస్వాముల దాష్టికపు ఆనవాళ్లు.. తిరుగుబాటు చైతన్యం తెచ్చే పాటలకు రగిలిపోయిన జనాలు ఎందరో ఉత్తేజితులై ‘ఉద్యమం’బాటపట్టేవారు.


– అడవితల్లే అమ్మా-నాన్న.!
అణగారిన వర్గాలవారికి.. అన్యాయానికి గురైన వారికి మేమున్నామంటూ అండగా నిలిచే అన్నలకు కంటికి రెప్పలా కాపాడుకునే అడవితల్లే అమ్మానాన్నలు.. తోటి ఉద్యమ వీరులే తోడబుట్టిన తోబుట్టువులుగా భావించి ఉద్యమానికి అంకితమైనవారెందరో.
– నేలతల్లికి ‘ఎర్రని’ సింధూరపు తిలకమైనవారెందరో!
తనను కన్నవారిని.. తాను కట్టుకున్నవారిని.. తన తోబుట్టువులను.. తాను కన్నవారిని.. ఆత్మీయులను వదిలి అడవిబాట పట్టిన ఉద్యమబిడ్డలెందరో ‘ప్రజాయుద్ధ క్షేత్రం’లో నేలకొరిగి నేలతల్లి నుదుటన సింధూర తిలకమైనవారందరికీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నివాళులు అర్పించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది.
– పోలీసుల అప్రమత్తం
యేటా జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు పార్టీ అనుకూల అటవీ ప్రాంతాల్లో రహస్యంగా నిర్వహించే ‘అమరుల సంస్మరణ వారోత్సవాల’పై పోలీసులు డేగ కన్నుపెట్టి అప్రమత్త చర్యలు చేపట్టారు. అదను దొరికితే మట్టుబెట్టేందుకు పకడ్బందీగా పావులుకదుపుతున్నారు. పోలీసులు-మావోయిస్టుల చర్యలు గుట్ట కింది గ్రామాల్లో గుబులు రేపుతున్నాయి.

నింగికెగిసినారా.. నేలతారలారా..
వేగుచుక్కలై దారి చూపుతారా!!

ఏతల్లి బిడ్డలో..భూతల్లి నుదిటిపై
మీ గుండె నెత్తుటితో బొట్టుపెట్టీ పోతిరో.!

పొట్టకొచ్చినా పైరుతల్లీ తల్లడిల్లూతున్నదీ.
పొదుగు చేరి లేగదూడా పాలుతాగానన్నది.

మీరుదాటిన యేరులన్నీ ఎక్కిఎక్కి ఏడ్చెనే.
చంపినోళ్ల సావుగాని చేతులెట్లా వచ్చెనే.

మీ అన్నదమ్ములని మరిచీపోతిరో..
మీ అక్కాచెల్లెల్లు ఇపుడు యాడవున్నరో..

మీ తల్లి కడుపులో పేగే కదిలెనో..
నిదురలో ఉలికి పడ్డదో..
మీ తండ్రి ఎదురుగా ఏ శకునము వచ్చెనో..
గుండెలో పిడుగు పడ్డదో..

యాడపుట్టి..యాడపెరిగీ..యాడసచ్చీ పోతిరో..
నేలతల్లే..కన్నతల్లై ఒడినచేర్చూకున్నదా..
ఒక్కసారి కళ్లుతెరిచి అమ్మ ఆని మీరు అంటరా..
కొడుకులాకే తలకొరివి పెట్టే రాతరాసీ పోతరా..

మా కంటిపాపా వెలుగుదివ్వెలవుతరా..
మా ఎదురువచ్చే పాలగువ్వాలవుతరా..
నాగేటి సాలల్ల మొలకలవుత‌రా..
తినేటి కంచాల్లో మెతుకులవుతరా..

నీడిచ్చె చెట్లకూ.. నీళ్లిచ్చె చెలిమెకూ నీ పేరు పెట్టుకుంటమే.!
సంక్రాంతి పండుగ వాకిట్లో ముగ్గులో నీ నవ్వు చూసుకుంటమే.!

తెల్లవారి చల్లగాలి చెంపమీద సోకితే..
అన్న మీరు కంటనీరూ తుడిచినట్టూ ఉంటదే..
కొండలల్లో కోనలల్లో పొద్దుపొడిచినప్పుడూ..
జెండ ఎత్తీ మీరు ఎదురు వచ్చీనట్టూ ఉంటదే.!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News