Monday, December 23, 2024

‘జువ్వాడి’ బ్రదర్స్​ స్నేహ ‘హస్తం’

– కారు దిగి వస్తున్న గులాబీ క్యాడర్​
– కోరుట్ల–మెట్​పల్లిలో రాజకీయ వలసల పర్వం
– ‘గులాబీ’ పార్టీలో కలవరం
– కాంగ్రెస్​ శిబిరంలో సంబురం
– జంపింగులకు కాంగ్రెస్​ తీర్థం
– ఎమ్మెల్యే శిబిరానికి షాక్​ల మీద షాక్​లు

నేటి సాక్షి, కోరుట్ల: రాష్ట్రమంతటా రాజకీయం ఒకతీరుగా ఉంటే.. కోరుట్లలో మరొక రకంగా ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఎన్నికలప్పుడు కూడా ఓటర్ల నాడి పసిగట్టడం అంతా ఈజీ కాదనేది మరో వాదన. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ పచ్చగా వర్ధిల్లినపుడు.. కోరుట్లలో చాలామంది ‘కార్యకర్తలు’ ఆ పార్టీ నీడన ‘నేతలు’గా ఎదిగారు. అయితే కాలక్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినపుడు… టీడీపీ కాస్తా కనుమరుగయి బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది. కేవలం తెలంగాణ సెంటిమెంట్‌తో ప్రజల్లోకి వచ్చిన బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అదే క్రమంలో కోరుట్లలో కూడా చాలామంది సైకిల్ దిగి కారెక్కారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హవా నడిచిన పదేళ్లు కూడా దర్జాగా “కారు”లో తిరిగిన నేతలు… ఇప్పుడు ఆ పార్టీకి ‘హ్యాండ్’ ఇచ్చి అధికార పార్టీ కాంగ్రెస్ చేయందుకోవడానికి తహతహలాడుతున్నారు. బీఆర్ఎస్ అంటే ఆ లీడర్లే.. ఆ లీడర్లంటే బీఆర్ఎస్ అనేంతగా గులాబీతోటలో ఎదిగిన నేతలు కూడా.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు కన్నేస్తున్నారు. కండువాలు మార్చి ‘చెయ్యె’త్తి జైకొడుతున్నారు.

– కారులో కలవరం.. కాంగ్రెస్‌లో సంబురం
కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి కుటుంబం గురించి చెప్పనక్కర్లేదు. స్వర్గీయ మాజీ మంత్రివర్యులు జువ్వాడి రత్నాకర్ రావు తొలుత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తదనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి చివరి శ్వాస వరకు అదే పార్టీలో కొనసాగారు. కార్యకర్తలను చేరదీయడంలో.. ప్రజలతో మమేకం కావడంలో రత్నాకర్ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అయితే తర్వాత కాలంలో ఆయన తనయులు కోరుట్ల సెగ్మెంట్ నుంచి పలుమార్లు పోటీచేసినా విజయం దక్కలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేసినప్పటికీ నిరాశే ఎదురైంది. కానీ, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జువ్వాడి బ్రదర్స్‌కు కలిసొచ్చింది. కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా జువ్వాడి నర్సింగరావు వ్యవహరిస్తుండటంతో అన్నీ తామై ముందుకెళుతున్నారు. అధికారులతో సత్సంబంధాలు నెరపడం, కార్యకర్తలతో కలిసిపోవడం, ప్రజలతో మమేకం కావడం… ఇవన్నీ కూడా జువ్వాడి బ్రదర్స్‌ మరింత ముందుకెళ్లడానికి ఊతమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జువ్వాడి బ్రదర్స్ జోష్‌తో… కార్యకర్తల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. మరోవైపు జువ్వాడి బ్రదర్స్ కోరుట్ల సెగ్మెంట్‌లో చక్రం తిప్పుతున్నారనేది బహిరంగ విషయమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కల్వకుంట్ల సంజయ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. అయితే జువ్వాడి బ్రదర్స్ కోరుట్లలో అందరికీ అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్ఠతకు బీజం వేశారు. అలా మొక్కై ఎదిగి మహావృక్షంలా మారుతోంది కాంగ్రెస్ శిబిరం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కోరుట్లలో ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగేలా జువ్వాడి బ్రదర్స్ కీ రోల్ పోషించారు. ఇక అప్పటి నుంచి పార్టీలోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. మోకా చూసుకుని ఒక్కొక్కరికి చేయందిస్తూ పార్టీలోకి లాగుతున్నారు. ఇప్పటికే కోరుట్లలో ఇతర పార్టీల నుంచి చాలామంది నేతలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పేశారు జువ్వాడి బ్రదర్స్.

– జువ్వాడి చూపు.. కీలక నేతల వైపు
కోరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే క్రమంలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతల వైపు దృష్టి సారించారు జువ్వాడి బ్రదర్స్. ఒక్కొక్కరిని చేరదీస్తూ… చేయందిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పోస్తున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కొనసాగి తదనంతర పరిణామాలతో ఇతర పార్టీలకు జంపైన నేతలను తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించడంలో సఫలీకృతులయ్యారు. అదే కోవలో కారు బేజారయ్యేలా గులాబీ నేతలకు కాంగ్రెస్ తీర్థం పోస్తూ పార్టీ కండువా కప్పేస్తున్నారు. కోరుట్లకు చెందిన చాలామంది నేతలు కాంగ్రెస్ శిబిరంలో చేరిపోయారు. జువ్వాడి అనుచరులుగా మారిపోయారు. అదే క్రమంలో గత శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో మున్సిపల్ చైర్​పర్సన్ అన్నం లావణ్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు అనిల్ గౌడ్‌, అతని వెంట మరో ఆరుగురు కౌన్సిలర్లకు కాంగ్రెస్ తీర్థం పోయించిన జువ్వాడి బ్రదర్స్ కోరుట్ల నియోజకవర్గంలో గులాబీకి పెద్ద ముల్లే గుచ్చారనే టాక్ నడుస్తోంది.

– సీఎంతో చనువు.. జువ్వాడికి మలుపు
కోరుట్ల బీఆర్ఎస్ అంటే అనిల్.. అనిల్ అంటే కోరుట్ల బీఆర్ఎస్ పార్టీ అనేంతలా ముద్ర వేసుకున్న పట్టణాధ్యక్షుడికి గాలం వేశారు జువ్వాడి బ్రదర్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందరూ కాంగ్రెస్ వైపు చూసినా.. అనిల్ మాత్రం అటు వైపు కన్నెత్తి చూడడనే టాక్ నడిచింది. అలాంటిది అనిల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నాడని తెలియగానే హాట్ టాపికైంది. ఆయనతో పాటు మున్సిపల్ చైర్​పర్సన్​గా కొనసాగుతున్న అనిల్ సతీమణి లావణ్య, మరో ఆరుగురు కౌన్సిలర్లు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో జువ్వాడి బ్రదర్స్ దగ్గరుండి వారికి కాంగ్రెస్ కండువా కప్పించారు. అనంతరం వారందరినీ కూడా అటునుంచి అటే సీఎం రేవంత్​రెడ్డి ఇంటికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి సమక్షంలో మరోసారి కండువా కప్పించేశారు జువ్వాడి బ్రదర్స్. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ సీఎంకు పరిచయం చేయడంతో.. ఆయన కూడా ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు. దాంతో సీఎం దగ్గర జువ్వాడికి ఉన్న చనువు చూసి కొత్తగా పార్టీలో చేరిన వారందరూ హ్యాపీగా ఫీలయ్యారు. కౌన్సిలర్ స్థాయి నేతలతో కూడా సీఎం ఇంత ఆప్యాయంగా మాట్లాడుతారా! అని వారిలో వారు చర్చించుకోవడం కనిపించింది. మొత్తానికి జువ్వాడి టార్గెట్‌కు సీఎం రేవంత్​రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే విషయం మరోసారి బలపడినట్లైంది.

– మెట్​పల్లి ‘పుర’ పాలకులకూ గాలం
అనుకున్నట్టుగానే.. కోరుట్ల పురపాలక వర్గం ‘చే’జిక్కగా.. వారం తిరక్కముందే ఈసారి ‘మెట్​పల్లి-పురపాలక’ వర్గంపై జువ్వాడి దృష్టిసారించారు. అతని సునిశిత దృష్టి.. ఆప్యాయత రెండూ కలిసి ఎమ్మెల్యే తిండి విద్యాసాగర్​రావు భాగస్వామిగా ముద్రపడ్డ నేతగా రణవేణి సుజాతా–సత్యనారాయణ కూడా జువ్వాడి నర్సింగరావు ‘చే’యందుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. అతనితో పాటు మెట్​పల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు రాజారాంతో కలిసి మరికొందరు ‘కాంగ్రెస్’తో జత కట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో ‘జువ్వాడి బ్రదర్స్’ ఎమ్మెల్యే ఆధిపత్యంపై విజయం సాధించినట్టైంది.!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News