-ఆకస్మికంగా మండలంలో పర్యటన
నేటి సాక్షి,వేమనపల్లి:
చదువుకునే వయస్సు గల ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండే విధంగా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల,తహశిల్దార్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,శాఖా గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు,రికార్డులు,అధికారులు పనితీరు,కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని,బడి వయస్సు గల పిల్లలు పాఠశాలలకు వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంపొందించాలని,విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని,మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని తెలిపారు.ఉపాధ్యాయులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని,సమయపాలన పాటించాలని తెలిపారు.విద్యార్థులతో మాట్లాడుతూ చదువుకున్న వారికి సమాజంలో గౌరవం,గుర్తింపు ఉంటుందని,ఒక లక్ష్యాన్ని ఎంచుకొని పట్టుదల,ఏకాగ్రతతో చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు.పాఠశాల ఉపాధ్యాయురాలు అనుమతి లేకుండా గైర్హాజరు అయినందున షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు.మండల తహశిల్దార్ కార్యాలయంలో ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించి వ్యవసాయ భూములకు సంబంధించి వివిధ రకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అభ్యర్థులు ధరణి పోర్టల్లో చేసుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వివరాల మార్పులు,సవరణ కొరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అన్నారు.మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో దరఖాస్తుల పరిశీలన తీరును పరిశీలించి ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో అర్హత గల లబ్దిదారులకు పథకాల ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు,పాఠశాలలు, కళాశాలలు,ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటి సంరక్షించాలని,ఆయా శాఖల వారిగా కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలోని వార్డులు,ఫార్మసీ,ల్యాబ్, పరిసరాలు,రిజిస్టర్లు పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, వైద్యులు,సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని,వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.అనంతరం నీల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పరిశీలించారు.వర్షాకాలంలో విద్యార్థులకు ఎలాంటి అంటువ్యాధులు,విషజ్వరాలు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ బొబ్బల శ్రీధర్రెడ్డి, రెవెన్యూ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయ సిబ్బంది,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు, వైద్యులు,పంచాయతీ కార్యదర్శి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.