- పెద్దపల్లి అదనపు కలెక్టర్ డీ వేణు
- మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరు
నేటి సాక్షి, పెద్దపల్లి : విద్యతోనే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని పెద్దపల్లి అదనపు కలెక్టర్ డీ వేణు అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి నెహ్రూ నాయకత్వంలోని క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందీ, అరబిక్, బెంగాలీ, ఇంగ్లిష్భాషల్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 ఏండ్ల పాటు విద్యాశాఖ మంత్రిగా సేవలందించారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని, కులమత భేదాలు లేకుండా కృషి చేశారని వివరించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని అన్నారు. పేదరికం విద్యతో మాత్రమే దూరమవుతుందని నమ్మిన ఆయన, ప్రతి పేదవాడికి విద్య అందేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా మతపరమైన సంప్రదాయాలు పాటిస్తూ, మనమంతా భారతదేశంలో భాగమని గుర్తు చేసుకున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, గురుకులాల బాలికల విద్యపై దృష్టి సారించి చర్యలు తీసుకుంటోందని, ఇక్కడ అన్ని కులాలు, వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ షేక్ అక్బర్ అలీ తదితరులు పాల్గొన్నారు.



