ఆత్మహత్యకు గల కారణాలు…

నేటి సాక్షి, కొల్చారం (భూమయ్య):
మండల కేంద్రమైన కొల్చారం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్ (52) ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత ఎస్ఐ క్వార్టర్స్ ముందు చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయికుమార్ కు పిఎస్ లో రాత్రి షిఫ్టు డ్యూటీ ఉండగా అది పూర్తి చేసుకుని ఉదయం యధావిధిగా వాకింగ్ పూర్తిచేసుకునే స్థానిక బస్టాండ్ వద్ద ఓ హోటల్లో టిఫిన్ చేసి, చాయ్ తాగి తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చాడని స్థానికులు తెలిపారు. కాగా ఈ లోపే తాను ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా తన కూతురికి సమాచారం ఇచ్చి, ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో మృతిచెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ రాజశేఖర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని సాయికుమార్ మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు సాయికుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన వాడు కాగా 1992 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా ఉద్యోగం పొంది వృత్తిరీత్యా మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. సుమారు ఆరు సంవత్సరాల నుండి హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ, నర్సాపూర్ కౌడిపల్లి ఠాణాలలో పనిచేసి బదిలీపై సుమారు 20 నెలల క్రితం కొల్చారం పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సాయికుమార్‌కు భార్య, వివాహం అయిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇదిలా ఉండగా పోలీసుల కథనం ప్రకారం సాయికుమార్ ఆత్మహత్యకు గల కారణాలు ఇలా ఉన్నాయి… నర్సాపూర్ పట్టణంలో టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్న దివ్య అనే మహిళతో కానిస్టేబుల్ సాయికుమార్ కు పరిచయం ఏర్పడింది. సాయికుమార్ పలుమార్లు ఆమెతో ఫోన్లో సంభాషించడానికి గమనించిన సదరు మహిళ భర్త శివకుమార్, అల్లుడు కిరణ్ తో కలిసి కానిస్టేబుల్ సాయికుమార్ ను భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించి, ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, చంపేస్తామంటూ బెదిరించారు. దీంతో విషయం బయటకు తెలిస్తే ఎక్కడ పరువు పోతుందోనని మనస్థాపానికి గురై సాయికుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సాయికుమార్ భార్య కాటూరి శైలజ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

