- వారి నుంచి మూడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం
- అడవిలోని మరికొంత మంది కోసం టాస్క్ ఫోర్సు తీవ్రంగా గాలింపులు
నేటి సాక్షి ప్రతినిధి, బాదూరు బాలయ్య : తిరుపతి జిల్లా శ్రీవారిమెట్టు సమీపంలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి నుంచి మూడు ఎర్రచందనం దుంగలు టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణ మేరకు, టాస్క్ ఫోర్సు ఎస్పీ శ్రీ పీ. శ్రీనివాస్ గారి అధ్వర్యంలో డీఎస్పీలు శ్రీ జి.బాలిరెడ్డి, శ్రీ. వి.శ్రీనివాసరెడ్డి, శ్రీ ఎండీ షరీఫ్ ల మార్గనిర్దేశంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ టి. విష్ణువర్దన్ కుమార్ టీమ్ బుధవారం చంద్రగిరి మండలం, బాకరాపేట రేంజిలోని నాగపట్ల బీట్ పరిధిలో కూంబింగ్ చేపట్టారు. వీరు శ్రీవారిమెట్టుకు పడమర వైపుకు చేరుకునే సరికి ముగ్గురు వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. వీరిని హెచ్చరించి చుట్టుముట్టే సరికి ఒక వ్యక్తి దుంగను పడేసి పారిపోగా, మిగిలిన ఇద్దరిని అరెస్టు చేశారు. అక్కడ మూడు దుంగలను సేకరించి, అరెస్టు చేసిన ఇద్దరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. వీరిపై టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేయగా, ఎస్ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో మరికొంత మంది స్మగ్లర్లు నిషేదిత అటవీ ప్రాంతంలో ఉన్నట్లు తెలియడంతో వారి కోసం టాస్క్ ఫోర్సు సిబ్బంది తీవ్ర గాలింపులు చేపట్టారు.

