- – ఆగని అక్రమ తయారీ, అమ్మకాలు
- – పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ
- – పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

నేటి సాక్షి , జమ్మికుంట: కరీంనగర్జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట మండలాల్లో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ గ్రామాల్లో గుడుంబా అమ్మకాలు విచ్ఛలవిడిగా కొనసాగుతున్నా, ఎక్సైజ్అధికారులకు పట్టడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని కుంటలు, చెరువుల సమీపంలో గుడుంబా తయారు చేస్తున్నారన్న సమాచారం ఉన్నా పట్టించుకునే నాథుడు కానరావడం లేదు. దీంతో గుడుంబా వ్యాపారం మూడు బట్టీలు.. ఆరు డ్రమ్ములు.. అన్నట్టు బిజినెస్‌కు అడ్డు అదుపు లేకుండాపోతున్నది. దీనికి తోడు ఆ పరిసర ప్రాంతాల్లో గుడుంబా ప్యాకెట్లు దర్శనమిస్తున్నా, అధికారులు నామమాత్రపు తనిఖీలు చేస్తూ ‘మమ’ అనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిధిలో పలు కుటుంబాలు విక్రయిస్తున్నారని సమాచారం మేరకు ఎక్సైజ్ ఎస్సై సౌమ్య ఆధ్వర్యంలో ఆదివారం సోదాలను నిర్వహించారు. అధికారుల సాక్షిగా గుడుంబా ఆనవాళ్లు అక్కడ కనబడుతున్నప్పటికీ నామమాత్రపు తనిఖీలు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారు. జమ్మికుంట పట్టణంలో జోరుగా గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యపు సమాధానం..
గుడుంబా తనిఖీ సందర్భంగా ఎక్సైజ్ ఎస్సై సౌమ్యను వివరణ కోరగా, ‘వివరణ అనేది ఏమీ లేదు.. డ్యూటీలో ఉండగా ఎవరైనా వాయిస్ ఇస్తారా?’.. అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ వెళ్లిపోయారు. గతంలో అధికారులు ఏ ప్రాంతంలోనైనా సోదాలు నిర్వహించినప్పుడు మీడియా కవరేజ్ కి వెళ్తే అధికారులు సానుకూలంగా స్పందించి పూర్తి వివరాలు తెలియజేయడంతో పాటు ముందస్తు చర్యల గురించి తెలిపేవారు. కానీ, ఎస్ఐ సౌమ్య దురుసు సమాధానం ఇవ్వడంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి. గుడుంబా విక్రయాలు అధికారులకు తెలిసే జరుగుతున్నాయా.. లేక మామూళ్ల మత్తులకు అలవాటు పడి చూసి చూడనట్లు ఉదాసీన వైఖరిని వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా అధికారులు సోదా చేసే సమయంలో ఖాళీ గుడుంబా ప్యాకెట్లు కనబడుతున్నప్పటికీ దానిపై లోతుగా విచారణ చేయకుండా నామమాత్రపు తనిఖీలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.




