- అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి : మంగళవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల అంశంపై విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ అధికారుల తో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈనెల 10వ తేదీన అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ వరకు చదువుతున్న విద్యార్థులకు రోడ్డు భద్రతపై పోస్టర్లను తయారు చేసే పోటీలను నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా జనవరి 21వ తేదీన ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటిఐ, మెడికల్ కళాశాలల విద్యార్థులకు రోడ్డు భద్రతపై, ప్రయాణికుల సంరక్షణకు ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయమై సలహాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఐడియాతన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. బెస్ట్ ఐడియాస్ ఇచ్చిన విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం రోజున అభినందన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఇక జనవరి 24వ తేదీన అన్ని విద్యాసంస్థల్లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ వరకు చదువుతున్న విద్యార్థులకు రోడ్డు భద్రతపై క్విజ్ పోటీలు నిర్వహించాలని సూచించారు. ఆ తర్వాత ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ఇవ్వాలని చెప్పారు. సమావేశం లో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సునందినీ దేవి, జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, ఇంటర్మీడియట్ అధికారి అంజయ్య, ఐటిఐ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.





