Wednesday, March 11, 2026

బానిసల్లాగా పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు

  • అధికారుల నిర్లక్ష్యమే కాంట్రాక్టర్ కొండంత బలం
  • బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికుల దుస్థితి
  • సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి) :- జిల్లాలోని బెల్లంపల్లి ఏరియా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కట్టు బానిస లాగా పనిచేస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి శనివారం ప్రకటనలో ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బెల్లంపల్లి ఏరియా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు, చట్టబద్ధమైన సౌకర్యాలు ఎస్ఎస్వి క్రియేషన్స్ కాంట్రాక్ట్ సంస్థ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం మూలంగా పనిచేస్తున్న కార్మికులకు ఏనాడు సక్రమంగా జీతాలు వచ్చిన పరిస్థితి లేదని, గత 6 నెలలుగా వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. పిఎఫ్ పేరుతో కోత విధించిన డబ్బులు సైతం కార్మికుల ఖాతాలో జమ కావడం లేదని ఆరోపించారు. ఎప్పుడో ఒకసారి ఇచ్చే ఒకటి, రెండు నెలల వేతనాల్లో సైతం కమిషన్ పేరుతో వేలాది రూపాయలను కాంట్రాక్టర్ దౌర్జన్యంగా కోత విధించడం జరుగుతుందని తెలిపారు. కార్మికులు తమ బాధలను అధికారులకు చెప్పుకుంటే పనిలో నుంచి తొలగించడం జరుగుతుందని బెదిరింపులకు పాల్పడుతూ, భయాందోళన కల్పిస్తున్నారని ఆరోపించారు. 76 ఏళ్ల స్వాతంత్ర దేశంలో అమలవుతున్న వెట్టి చాకిరి నిర్మూలన చట్టం ఈ ఆసుపత్రి వర్కర్లకు వర్తించదన్నట్లుగా అధికారులు, కాంట్రాక్టర్ కలిసి కార్మికులతో వెట్టి చాకిరితో పనిచేయిస్తున్నారని విమర్శించారు. పలుమార్లు జిల్లా కలెక్టర్ కు, స్థానిక అధికారులకు తెలియజేసిన ఫలితం శూన్యమని, తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని మూలంగా కాంట్రాక్టర్ తన ఇష్టానుసారం వ్యవహరిస్తూ, తనకు ఇష్టం వచ్చినప్పుడు వేతనాలు ఇస్తా, అప్పుడే తీసుకోండి, లేకుంటే పని లో నుంచి తప్పుకోండి అని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. వేతనాలు ఇవ్వడం లేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే, పనిలో నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వము, అధికారులు పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దీని మూలంగా 6 నెలలుగా వేతనాలు రాక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పండుగ పూట పస్తువులతో, అర్ధాకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు రావాల్సిన 6 నెలల వేతనాలు ఇప్పిస్తూ, పిఎఫ్, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేయించాలని అదే విధంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికులకు అండగా సిపిఎం పోరాట కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News