Thursday, March 12, 2026

అంగరంగ వైభవంగా అమ్మవారి కొండ చుట్టు ఉత్సవం

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) చంద్రగిరి: సంక్రాంతి పర్వదినాలలో ఆనవాయితీగా నిర్వహించే అమ్మవారి కొండ చుట్టు ఉత్సవం గురువారం భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మవారికి ఆనవాయితీగా అందజేస్తున్న పట్టు వస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు శ్రీకోదండరామ స్వామి ఆలయం నుండి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ అలంకరణ మండపంలో వేంచేపింప చేసి పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు వివిధ రకాల పూలతో అలంకరించారు. భక్తులు ఓం శక్తి నామస్మరణలతో అమ్మవారి ఆలయము నుండి శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయం వద్ద కొలువు తీర్చారు. స్థానిక ఆలయ దేవతలైన శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజులు, మిట్ట గంగమ్మ, రాయల కోట ముత్యాలమ్మ, అంకాలమ్మ, రాయలపురం శ్రీ మాతమ్మ వాహనాలను ఆయా గ్రామ పినపెద్దల ఆధ్వర్యంలో శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయం వద్ద కొలువు తీర్చారు. వివిధ రకాల డబ్బులు వాయిద్యాలు మేళ తాళాలు కోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ వాహనాలనన్నీ శ్రీ మూలస్థాన ఎల్లమ్మ వాహనం వెనుక బారులు తీరి పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వాహనాలకు ముందుగా స్థానిక శాసనసభ్యులు పులివర్తి నాని వివిధ పార్టీల నాయకులు వాహనాలతో కలిసి నడిచి వెళ్లారు. వైఎస్ఆర్సిపి యువ నాయకుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ద్రౌపతి సమేత ధర్మరాజు ఆలయం వద్ద వేంచేసిన దేవత మూర్తులను దర్శించుకున్నారు. స్థానికులు భారీ ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు. కేరళ వినూత్న విన్యాసం అందరినీ ఆకట్టుకుంది. పట్టణంలోని దేవతా వాహనాలన్నీ అగరాల ఆరివేణి మంగమ్మ ఆలయం వద్ద కొలువు తీరాయి. అక్కడి భక్తుల దర్శనాలు అనంతరం ఈ వాహన శ్రేణులన్నీ పులిత్తి వారి పల్లి వరకు వెళ్లి తిరిగి ఆలయాలకు చేరుకోగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ, శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల వాహనాలు ఐతేపల్లి పులిత్తివారిపల్లి, కొటాల, నాగయ్య గారి పల్లి, రెడ్డి వారి పల్లిల మీదుగా కొండ చుట్టుకుంటూ శుక్రవారం ఉదయం ఆయా ఆలయాలకు చేర్చారు. సాధారణ పోలీసు బందోబస్తే కాకుండా మంచు కుటుంబం గొడవల రీత్యా డిఎస్పి ప్రసాద్ అదనపు బలగాలతో సిఐ సుబ్బరామిరెడ్డి పర్యవేక్షణలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మమత, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు సూరి, భక్తులు ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News