జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల ప్రతినిధి:-
జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ జాతీయ రహదారి 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన బాధితుల వివరాలను మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావుతో కలిసి పరిశీలించి కార్యాలయానికి వచ్చిన బాధితులతో మాట్లాడుతూ, జాతీయ రహదారి 163జి 384 కిలోమీటర్ల మేర ఉంటుందని, రహదారి నిర్మాణంలో భూములు కోల్పోయిన వారి జాబితా ప్రకారం బాధితులకు నష్టపరిహారం చెల్లించడం జరిగిందని, ఆర్బిట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మొదటి జాబితాలో పరిహారం అందని అర్హత గల వారు సంబంధిత పత్రాలు, బ్యాంక్ పాస్ పుస్తకాలతో సంప్రదించినట్లయితే రికార్డులు పరిశీలించి సరిగ్గా ఉన్నట్లు నిర్ధారణ జరిగితే సంబంధిత లబ్దిదారుల నుండి అక్విటెన్సీ తీసుకొని నిర్దేశిత ధరల ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందని, నష్టపోయిన వారు ఆలస్యం చేయకుండా త్వరగా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.





