ఫిబ్రవరి 7న వేయి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శన
నేటిసాక్షి, జమ్మికుంట:

ఎస్సీ వర్గీకరణ అమలుపరచాలని జమ్మికుంటలో డప్పుల దండోరా నిర్వహించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో జరిగే వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శనలో మద్దతుగా పాల్గొంటామని తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలో జరిగిన కార్యక్రమం డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంబాల ప్రభాకర్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నలిగంటి శరత్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగానే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే ఏ కులానికి అన్యాయం జరగదు, జనాభా ప్రాతిపదికన ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు రిజర్వేషన్లు లభించి న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ పోరాటం న్యాయమైంది కనుకనే సమాజం మొత్తం మద్దతుఇచ్చిందని అన్నారు. కానీ మాలలు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి నేడు బలంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు.

ఆ అడ్డంకులను ఎదుర్కోవడానికి వెయ్యి గొంతులు – లక్ష డప్పులతో మండే మాదిగల గుండె చప్పుళ్ళును వినిపించడానికి శ్రీకారం చుట్టామని అన్నారు. మరొక్కసారి అన్ని సామాజిక వర్గాలలో ఉన్న కళా నేతలంతా ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మద్దతుగా నిలబడాలని అన్నారు. ఫిబ్రవరి 7 న జరుగు వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంలో కళానేతలు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ న్యాయం కాబట్టే మొదటి నుండి MRPS కు మద్దతు తెలుపుతున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఎంతటి బలమైన పాత్రని కళానేతలు పోషించారో అదే విధంగా ఎస్సీ వర్గీకరణ పోరాటాన్ని విజయానికి చేర్చడానికి కూడా అదే పాత్రను పోషిస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మరొక్కసారి గజ్జె కట్టి గళం విప్పి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం నూతన పాటలను రూపొందించి ప్రజల్ని మరింత చైతన్యం చేస్తామని అన్నారు. అందులో భాగంగా వెయ్యి గొంతులు లక్ష డప్పులు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులంతా పాల్గొంటామని తెలిపారు.






