Wednesday, March 11, 2026

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై సత్వరమే స్పందించాలి

  • జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్
  • బాధితులకు అండగా నిలవాలి
  • పేదల ఆర్థిక అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలి
  • కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్షించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేసినజాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో పోలీసు శాఖ సత్వరమే స్పందించి బాధితులకు అండగా నిలవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబు, రీసర్చ్ అధికారి డి. వరప్రసాద్, జిడబ్ల్యూఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిసిపి రవీందర్, డిఆర్ ఓ విజయలక్ష్మి లతో కలిసి జాతీయ కమిషన్ సభ్యులు రామచందర్ జిల్లాలో ఎస్సీల సంక్షేమం తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై అన్ని శాఖల అధికారులతో శాఖల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ, అభివృద్ధి, రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, సదుపాయాలను గురించి జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖడే వివరించారు. అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా అమలు చేసిన ప్రగతి నివేదికలను వివరించారు. రెవెన్యూ శాఖ, విద్యా శాఖ, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ పరిశ్రమలు, ఎస్సీ సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, సిరికల్చర్, జిడబ్ల్యూఎంసి, ఎస్.సి కార్పొరేషన్, దళిత బంధు, తదితర శాఖలు ఎస్సిలకు సంక్షేమం అమలు, పోలీసు శాఖ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు రామచందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి క్రమ శిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి శాఖల వారీగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రభుత్వ నియామకాలలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. నిరుపేదల ఆర్థిక అభివృద్ధి కోసం బ్యాంకర్లు చేయూత అందించేందుకు రుణాలందించాలని పేర్కొన్నారు. వారికి ఇబ్బందులు కలిగించొద్దని, పేదలకు సేవ చేస్తే భగవంతునికి చేసినట్లేనని ఆ సంకల్పంతో అధికారులు పనిచేయాలని సూచించారు. అసైన్డ్ భూములకు చట్టబద్ధత కల్పించి పాస్ పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లైంగిక దాడులు, హత్యకు గురైన బాధిత కుటుంబాలకు సత్వరమే న్యాయం జరగడంతో పాటు వారికి పరిహారం అందించాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. జిల్లాలో గుడుంబా విక్రయాలను పూర్తిగా నియంత్రించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీల ఆర్థిక అభ్యున్నతికి నిరంతరం పాటుపడాలని పేర్కొన్నారు. వారికి ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే స్పందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ భూ పెండింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరి స్తున్నామని తెలిపారు. అసైన్డ్ భూములకు చట్టపద్ధత కల్పించి పాస్ బుక్కులు అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీస్ డిసిపి రవీందర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు. చార్జిషీట్ ఫైల్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ను జిడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖాడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి సాదరంగా స్వాగతించారు. అనంతరం ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సమావేశంలో అన్నీ శాఖల జిల్లా అధికారులు, ఏసీపీ లు, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News