Wednesday, March 11, 2026

భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది

  • బీఆర్ఎస్ నిరంకుశ పాలన నుండి కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలన
  • అన్ని వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : కేంద్ర బీజేపీ పాలనలో భారతదేశంలో రాజ్యాంగం, ప్రజా స్వామ్యం ప్రమాదంలో పడ్డాయని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. శుక్రవారం రఘునాథపల్లి మండలం నిడిగొండ సత్య సాయి గార్డెన్స్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ బిజెపి మతతత్వ పార్టీ అని కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చ గొడుతూ రాజకీయ పబ్బం గడుపుతోందని విమర్శించారు. నరేంద్ర మోడీ అమిత్ షాలు రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలు చేస్తున్నారని, అంబేద్కర్ ను అధ:పాతాళానికి తొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ వేదికగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ ను అవమానించారని అన్నారు. అంబేద్కర్ ని తలుచుకోవడం అంటే తమకు స్వర్గంతో సమానమని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు దేశంలో బలహీన వర్గాలకు న్యాయం, మహిళలకు అవకాశాలు పెరిగాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరంకుశ పాలన నుండి కాంగ్రెస్ ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేద బడుగు బలహీన వర్గాలన్నింటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలకు కట్టుబడి ఉందని, దశల వారీగా వాటి అమలు ప్రక్రియను చేపడుతోందని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కు వంట గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఓవైపు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు కడుతూనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు. బిజెపి – బీఆర్ఎస్ ల మధ్య జైలు, బెయిలు బంధం కొనసాగుతుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి బీఆర్‌ఎస్-బీజేపీ కూటమి ప్రయత్నిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టాలన్నారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు వివిధ శాఖల మంత్రులను కలిసి ఒక్క ఏడాదిలొనే నియోజకవర్గ అభివృద్ధికి 750 కోట్లు మంజూరు తీసుకొచ్చిన ఘనత ఎమ్మెల్యే కడియం శ్రీహరికి దక్కుతుందని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీగా చేసుకోవడంతోపాటు, యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ ఆఫీసుల కాంప్లెక్స్, 100 పడకల ఆసుపత్రితో పాటు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే దిశగా అభివృద్ధి చేస్తున్నారని ఎంపీ డా. కడియం కావ్య పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ అభివృద్ధిలో తన వంతు సహకారంలో అందించడంలో ముందుంటానని ఎంపీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా అభివృద్ధికి 6 వేల కోట్లు కేటాయించారని అన్నారు. వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్, భూగర్భ డ్రైనేజీ, మామునూరు ఎయిర్ పోర్టు, కాజీపేట జంక్షన్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులు వెగంగా జరుగుతున్నాయని తెలిపారు. పదేళ్ల తరువాత మళ్ళీ కాంగ్రెస్ పాలనలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో వరంగల్ మరింత అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు కోళ్ల రవి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ మరియు మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా మరియు మండల యువజన నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు మహిళా కాంగ్రెస్ సభ్యులు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News