- జిల్లాలో కక్షపూరితంగానే ఆర్ఎంపీ లపై దాడులు..
- ఆర్ఎంపీలపై దాడులు ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ తెలిసి జరుగుతున్నాయా..?
- బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు..
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
గత రెండురోజులుగా ఆర్ఎంపీల పై రాజన్న సిరిసిల్ల జిల్లాలో కక్ష పూరితంగా దాడులు చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో తక్షణ వైద్యసేవలకు ఉపయోగపడే వారిపై కక్ష సాధింపులు ఎందుకు అని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ… ఆర్ఎంపీ, పీఎంపీలకు ఆరు నెలల శిక్షణ ఇచ్చి, 2009 యాక్టును అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారని, హామీ ఇచ్చి ఏడాది అవుతోంది కానీ, నేటికి ఆర్ఎంపీలకు శిక్షణ ఇవ్వలేదని,వారిని ఎలా ముందుకు వెళ్లాలో చెప్పడం లేదని అన్నారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈ దాడులు జరుగుతున్నాయని, ఇందులో ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏక కాలంలో దాడులు చేస్తున్నారని, ఇన్నాళ్లుగా లేని దాడులు ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమైనా ప్రజల నుంచి ఫిర్యాదొలొచ్చాయా, లేక ఎమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ఆ విషయాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిజంగానే ఫిర్యాదులొస్తే దానికి గల కారణాలు ఏమిటో చూడాలని,అప్పుడు సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, కానీ వీటన్నింటిని పక్కన పెట్టి, ఆర్ఎంపీలను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,అందుకే వారికి మద్ధతు ప్రకటిస్తున్నామని అన్నారు. గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో ఆర్ఎంపీల ద్వారా వైద్యం అందాలంటే,వారిపై చర్యలు తీసుకోవడం,దాడులు చేయడం కాదని,వారికి శిక్షణ ఇచ్చి,వారిని ఉత్తములుగా తీర్చి దిద్దలని అన్నారు. శిక్షణద్వారా నేర్చుకున్న మేరకు ఎంత వరకు ఏ తరహా వైద్యం చేయాలో నిర్దేశించలని,ఆ పరిధి దాటితే వారిపైచర్యలు తీసుకుంటే,అప్పుడు ప్రజలు హర్షిస్తారని,అంతే తప్ప ఆర్ఎంపీలపై ఇష్టానుసారం దాడులుచేసి వారిని భయబ్రాంతులకు గురిచేయడం సముచితం కాదని అన్నారు. ఆర్ఎంపీలపై జరుగుతున్న దాడుల విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని,అక్కడి నుంచి ఎటువంటి నిర్ణయాలు రాక ముందే రాజన్న సిరిసిల్లలో దాడులు ఏమిటీని ప్రశ్నించారు. ఆర్ఎంపీలపై దాడులు ప్రభుత్వ విప్ అదిశ్రీనివాసుకు తెలిసి జరుగుతున్నాయా, లేక అధికారులే చేస్తున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు.ఆర్ఎంపీలపై ఇంత కక్ష పూరితంగా అధికారులు వ్యవహారిస్తే,ప్రభుత్వ విప్‌గా అధికారులను ప్రశ్నించడంతో పాటుగా వారిని నిలువారించాల్సిన బాధ్యత విఫ్‌గా మీపై లేదంటారా,నిజంగానే మీకు ఆర్ఎంపీలపై చిత్తశుద్ధి ఉంటే,మీరు మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎందుకు శిక్షణ ఇవ్వడం లేదని,మీరు శిక్షణ ఇవ్వకుండా వారిపై దాడులుచేస్తే ఎలా అని అన్నారు. ఇప్పటికైనా ఆర్ఎంపీలు,పీఎంపీలపై అధికారులు దాడులు నిలిపివేయాలని,వారికి శిక్షణ ఇచ్చి అందుకు తగినవిధంగా సర్టిఫికెట్లు,లైసెన్స్‌లు మంజూరు చేసి వారు పల్లె ప్రజలకు సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొంత కాలంగా అధికారులు పలు అంశాల్లో బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి చర్యలు తీసుకుంటున్నారని,ఇది మంచి పద్దతి కాదని, భవిష్యత్తులో ఏది జరిగినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





