- ఇంతవరకు సరిచేయని అధికారులు
- నిస్సహస్థితిలో లబ్ధిదారులు
- పూర్తి కాని ఇందిరమ్మ ఇండ్ల సర్వే
- 21 నుండి గ్రామసభలు.. లబ్ధిదారుల ఎంపికలు
- అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కేనా
- దళారుల చేతులలో చిక్కేనా

నేటిసాక్షి, వీణవంక:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలలో భాగంగా, 6 గ్యారంటీల పథకాన్ని ఎంతో ఆర్భాటంగా కొన్ని సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి, అందులో భాగంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసే ఉద్దేశంతో, ప్రజాపాలన దరఖాస్తులు, కుల గణన సర్వేల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని, మండల స్థాయి అధికారులను ఆదేశించింది. నాలుగు పథకాల ఎంపికలో మండల ఎంపీడీవోలకు పూర్తి అధికారం కట్టబెట్టింది. కానీ, గత సంవత్సరంలో స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తులు వివరాలు ఎంట్రీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా, ఒక గ్రామానికి బదులుగా, మరొక గ్రామం నమోదయింది. ఈనెల 16 నుండి 19 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని అధికారులకు సూచించగా, లబ్ధిదారులు తప్పుగా నమోదైన వివరాలను తెలుపుతూ సంబంధిత ఎంపీడీవో కు వినతి పత్రం అందజేయగా, తప్పుగా పడిన గ్రామం నుండి లబ్ధిదారు నివాస గ్రామానికి మార్చారు. కానీ, సొంత గ్రామం యాప్ లో వివరాలు సూచించడం లేదని అధికారులు తెలుపుతున్నారు. ఈనెల 21న గ్రామ సభలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక చేయనున్నారు. మూడు రోజులు గడుస్తున్న ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో వివరాలు నమోదు కాకపోవడంతో లబ్ధిదారులు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎంపికలో నిరుపేదలు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులకు, భూములేని నిరుపేదలకు, పారిశుద్ధ కార్మికులకు మొదటి అవకాశం కల్పించిందని, కంప్యూటర్ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా తప్పుగా పడిన లబ్ధిదారుల్లో నిరుపేదలు, దివ్యాంగులు ఉన్నామని, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో నిరుపేద కూలీలకు అవకాశం కల్పించాలని, నూతన రేషన్ కార్డులను అర్హత కలిగిన వారందరికీ ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఇన్చార్జి మంత్రి, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, జిల్లా అధికారులు జోక్యం చేసుకొని, వెంటనే ఇందిరమ్మ యాప్ లో తప్పుగా పడిన వివరాలను సవరించి మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.




