- మల్లికాంబ మనోవికాస కేంద్రానికి రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ బాలసముద్రం లోని మల్లికాంబ మనో వికాస కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి – వినయ రాణి దంపతులు మానసిక దివ్యాంగులతో కలసి వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మల్లికాంబ మనోవికాస కేంద్రంలోని మానసిక దివ్యాంగులు నా కుటుంబ సభ్యులని వారి మధ్య ఈరోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మల్లికాంబ మనోవికాస కేంద్రంలోని మానసిక దివ్యాంగులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అండగా నిలిచారు. కడియం ఫౌండేషన్ ద్వారా రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రతి పండగ, పుట్టిన రోజులు, పెళ్లి రోజు వేడుకలను దివ్యాంగుల మధ్య జరుపుకోవడమే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టి జల్సాలు చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. సమాజంలో ఇలాంటి ఎంతో మంది దివ్యాంగులు ఉన్నారని, పుట్టిన రోజులు పెళ్లిరోజులు గొప్ప పండుగలు జరుపుకునే వారు ఈలాంటి స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సహాయం అందిస్తే నిర్వాహకులకు కాస్త ధైర్యం ఉంటుందని సూచించారు. కడియం ఫౌండేషన్ ద్వారా మా కుటుంబ సభ్యులందరూ మల్లికాంబ మనోవికాస కేంద్రానికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యంగులకు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహలను ఎమ్మెల్యే అభినందించారు. చిన్నారులందరు భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. చిన్నారులతో కలసి కేక్ కట్ చేసారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే కడియం దంపతులు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్య క్రమంలో మల్లికాంబ మనో వికాస కేంద్రం ఫౌండర్ రామలీల, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.




