- జిల్లా కలెక్టరేట్ ఎదుట ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేపట్టిన అస్పత్రి అవుట్ సోర్సింగ్ వర్కర్లు
- జీవో నెంబర్ 60 ను అమలు చేయాలి అస్పత్రి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి
- ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, జిల్లా ఉపాధికల్పనాధికారి, లేబర్ కమీషనర్ లకు వేర్వేరుగా వినతి పత్రాలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ఏరియా ఆసుపత్రిలో ఎస్ఎస్ వి క్రియేషన్స్ ఏజెన్సీ కార్మికులకు చెల్లించే పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా మోసం చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న వేతనాలు, కోత విధించిన పిఎఫ్, ఈఎస్ఐ ను కార్మికుల ఖాతాల్లో జమచేయాలని జీవో నెంబర్ 60 ను అమలు చేయాలని అస్పత్రి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్, జిల్లా ఉపాధికల్పనాధికారి, లేబర్ కమీషనర్ లకు వేర్వేరుగా వినతి పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ఏజెన్సీ ద్వారా 40 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. ఏజెన్సీ ద్వారా ఫిబ్రవరి 2022న 25 మందిని విధుల్లోకి తీసుకున్నారని, వారికి 6 నెలల జీతం చెల్లించారే తప్ప ఈఎస్ఐ, పిఎఫ్ చెల్లించలేదని ఆరోపించారు. 2024 మే నెల మాత్రమే పిఎఫ్ 1200 రూపాయలు చెల్లించారని ప్రస్తుతం ఐదు నెలలు వేతనం పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఏజెన్సీ ప్రారంభం అయినప్పటి నుండి రెండు సంవత్సరాలు గడిచిన ఏజెన్సీ కాంట్రాక్టర్ యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏజెన్సీని 05-మే-2022 నుండి 10-మార్చి-2023 వరకు ఉపాధి కల్పనాధికారి ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందని తెలిపారని, బ్లాక్ లిస్టులో ఉన్న ఏజెన్సీని ఆస్పత్రి నందు ఎలా టెండర్ కు అనుమతించారో తెలుపాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీ కాంట్రాక్టర్ నిరుద్యోగ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంతమంది నుండి డబ్బులు వసూలు చేస్తూ, ఉద్యోగాలు ఇస్తున్నాడని నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని, ప్రతి నెల వేతనాలు చెల్లించడం లేదని, పిఎఫ్, ఈఎస్ఐ లో కోత విదిస్తూ లక్షలది రూపాయలు కాంట్రాక్టర్ కార్మికులకు ఇవ్వకుండా దోచుకుంటున్నాడని కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఏజెన్సీ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆసుపత్రి సూపర్డెంట్, ఏజెన్సీ సూపర్వైజర్, మంచిర్యాల డిసీహెచ్ లకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాన్ని చెల్లించాలని అలాగే సక్రమంగా పిఎఫ్, ఈఎస్ఐ ప్రతినెల చెల్లించాలని జీవో నెంబర్ 60 ను అమలు చేయని ఎస్ఎస్ వి క్రియేషన్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వాలని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా కార్యదర్శి పైరాల రాములు, అస్పత్రి అవుట్ సోర్సింగ్ వర్కర్లు రమేష్, శ్రీకాంత్, శేఖర్, అన్వర్, అవినాష్, దీప, మల్లిశ్వరి, లక్ష్మి, సృజన తదితరులు పాల్గొన్నారు.




