Friday, March 13, 2026

అర్హులందరికి సాచురేషన్ పద్ధతిలో ప్రభుత్వ పథకాల అమలు

  • జూలపల్లి మండలం చీమల పేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో
  • గ్రామ సభలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే

నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి) : ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలను అర్హులందరికీ సాచురేషన్ పద్ధతిలో అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష జూలపల్లి మండలం చీమల పేట గ్రామంలో 4 నూతన కార్యాక్రమాల అమలు పై నిర్వహించిన గ్రామ సభలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న 4 కార్యక్రమాలను అర్హులైన లబ్దిదారులకు సాచురేషన్ పద్దతిలో పారదర్శకంగా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా పథకం కింద వ్యవసాయ యోగ్యమైన పూర్తి భూమి ఎకరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. గ్రామంలో రైతు రుణమాఫీ జరిగిన రైతులు, సన్న రకం పంటకు బోనస్ వచ్చిన రైతుల వివరాలను సైతం అంటించామని అన్నారు. చీమల పేట గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మార్గదర్శకాల ప్రకారం వ్యవసాయ భూమి లేని 24 రైతు కుటుంబాలను గుర్తించామని, వీరికి 12 వేల రూపాయలు రెండు విడతల్లో జమ చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించి జాబితా గ్రామంలో ప్రదర్శించామని, ఏదైనా అభ్యంతరాలు ఉన్నా, ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని పరిశీలించి అమలు చేయడం జరుగుతుందని అన్నారు. 2023 లో వచ్చిన ప్రజా పాలన దరఖాస్తులు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు, మీ సేవా దరఖాస్తులను క్రోడీకరించి గ్రామంలో 66 మంది రేషన్ కార్డుల కొత్తగా అందించేందుకు జాబితా సిద్ధం చేశామని, ఈ జాబితాను ప్రజలు పరిశీలించే అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని, రేషన్ కార్డులకు అర్హులు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజా పాలన లో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలను పరిశీలించి గ్రామంలో ఇండ్ల స్థలం ఉన్న 151, ఇండ్ల స్థలం లేని 13 మాది అర్హులను ఎంపిక చేశామని అన్నారు. వితంతువులు, దివ్యాంగులు, అత్యంత నిరుపేదలు ప్రాధాన్యతగా జాబితా సిద్ధం చేశామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకపోతే దరఖాస్తు అందించాలని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఆరోగ్యశ్రీ 10 లక్షల కు పెంపు,గృహ జ్యోతి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి 4 కొత్త కార్యక్రమా లను విజయవంతంగా అమలు చేశామని, అదేవిధంగా రెండవ సంవత్సరం ప్రారంభంలోనే మరో నాలుగు నూతన కార్యక్రమాలు అమలుకు కార్యాచరణ చేపట్టామని అన్నారు. పేదల పై ఎటువంటి భారం వేయకుండా సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. గతంలో వడ్ల అమ్ముకునే సమయంలో రైస్ మిల్లర్ల వద్ద కటింగ్ సమస్యలు ఉండేవని, మన ప్రభుత్వంలో ఎక్కడ కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేసి 48 గంటలలో రైతుల ఖాతాలో నిధులు జమ చేసామని అన్నారు. వానాకాలం పంటలో సన్న రకం ధాన్యం క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అందజేశామని అన్నారు. గతంలో పాలకులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందిస్తామని మోసం చేసినప్పటికీ, మన ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు.రైతు కూలీల గురించి ఆలోచించి ప్రభుత్వం రెండు విడత లలో 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు. చీమల పేట గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులకు తప్ప మిగిలిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా చర్యలు చేపట్టామని అన్నారు. చీమల పేట గ్రామంలో 200 పై చిలుకు రైతులకు 2 లక్షల రుణ మాఫీ పూర్తి చేశామని అన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, మండల ప్రత్యేక అధికారి శంకర్,మండల పంచాయతీ అధికారి అనిల్ రెడ్డి, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News