- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : ప్రజావాణిలో వచ్చే అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియం లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అర్జీలు తీసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వృద్ధురాలి సమస్యపై కలెక్టర్ స్పందన :
నడవలేక ఇబ్బంది పడుతున్న ఓ వృద్ధురాలి సమస్యపై జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తక్షణం స్పందించారు. ఆమెకు వీల్ చైర్ అందజేసి, ఇబ్బందిని దూరం చేశారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మేరుగు విజయ చాలా రోజులుగా నడవలేక ఇబ్బంది పడుతున్నారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి వచ్చారు. తన దరఖాస్తును కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు అందజేయడంతో, వెంటనే స్పందించి వీల్ చైర్ ఇవ్వాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించగా, ఆయన విజయకు వీల్ చైర్ అందజేశారు. తన సమస్యను సత్వరమే పరిష్కరించి వీల్ చైర్ అందజేసిన కలెక్టర్ కు వృద్ధురాలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత త్వరగా సమస్య పరిష్కారం కావడంతో హర్షం వ్యక్తం చేశారు.





