- మా జాగలు కబ్జా చేస్తున్నారు
- పోలీస్, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేత
- గోడు వెళ్ళబోసుకున్న నిరుపేద పద్మశాలి కులస్తులు
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలోని నిరుపేద పద్మశాలి కులస్తులు రోడ్డెక్కారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఇండ్లు నిర్మించుకుంటే ఎస్సీ కులానికి చెందిన కొందరు భయభ్రాంతులకు, బెదిరింపులకు పాల్పడుతూ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీసీ కాలనీ కుటుంబాలంతా కమలాపూర్ పద్మశాలి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో దండు కట్టాయి. మంగళవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ కార్యాలయంలో సదురు బాధితులపై కంప్లైంట్ చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు. బీసీ కాలనీ లో 122 మందికి 1987లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కమలాపూర్ కు చెందిన కొంతమంది ఎస్సీ కులస్తులు కాలనీ వాసులను కొద్ది సంవత్సరాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇండ్లు కట్టుకుంటుంటే మాకు చెందిన భూమి అంటూ ఇంటి నిర్మాణాలు ఆపుతూ ఇబ్బందులకు గురి చేయడంతో పాటు, డబ్బులు డిమాండ్ చేయడంతో కొద్ది సంవత్సరాలుగా అప్పులు చేసి మరి డబ్బులు చెల్లించామని, మహిళలని చూడకుండా దురుసుగా మాట్లాడడంతో పాటు పద్మశాలి కులస్తులను కించపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇక వారి ఆగడాలు భరించలేక ఇవాళ మీకు ఫిర్యాదు చేస్తున్నామని, వారి వేధింపులతో ఇక మేము బతకలేమని, మాకు ప్రాణభయం ఉందని వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపించి కొందరి వల్ల పడే బాధల నుండి మమ్మల్ని విముక్తి చేయాలని, కబ్జా చేసిన భూములను కాపాడాలని బీసీ కాలనీ కుటుంబాలు ఆఫీసర్లను వేడుకున్నాయి. మాకు న్యాయం చేయకుంటే ఇంటిల్లిపాదితో కలిసి నిరాహార దీక్షకు పూనుకుంటామని మాకు న్యాయం చేయాలని బీసీ కాలనీ వాసులంతా ఆఫీసర్లను కోరారు.





