- రామాజీపేటలో విషాదం



నేటిసాక్షి, రాయికల్: రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన ఇద్దం నవీన్‌రెడ్డి(27) అనే యువకుడు ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నవీన్‌రెడ్డి తన కెజివిల్ ట్రాక్టర్‌ను తీసుకెల్లి రామాజీపేట, కుమ్మరిపెల్లి గ్రామాల మధ్య గల తన స్వంత వ్యవసాయ భూమిలో వరి నాట్ల కోసం దుక్కిదున్నుతుండగా ట్రాక్టర్ బురదలో దిగబడింది. ట్రాక్టర్ నుండి కెజివిల్ తొలగించే క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి నవీన్ మీద పడింది. దాంతో బురదలో కూరుకుపోయి నవీన్ ఊపిరాడక సంఘటన స్థలంలోనే మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు నవీన్‌కు భార్య, ఐదేళ్ల లోపు కుమారుడు, కూతురు ఉన్నారు. నవీన్ తండ్రి ఇటీవలనే మృతి చెందడంతో నవీన్ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండగా అతని మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరౌతున్నారు.





