- ప్రాజక్టు స్క్రీనింగ్ కమిటీ నోడల్ అధికారి డా, సి సువర్ణ

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- రాష్ట్రంలోని ఎంపిక చేయబడిన అటవీ డివిజన్లలో సరైన అనుమతులతో రోడ్లు, బాలన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రాజక్టు స్క్రీనింగ్ కమిటీ నోడల్ అధికారి డా, సి సువర్ణ అన్నారు. బుధవారం హైదరాబాద్ అరణ్య భవనంలోని పిసిసిఎఫ్ కార్యాలయం నుండి ఇరిగేషన్, క్యాట్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా ప్రాజక్టు స్క్రీనింగ్ కమిటీలోని జిల్లాల కలెక్టర్లు, అటవీ అధికారులు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజక్టు స్క్రీనింగ్ కమిటీ నోడల్ అధికారి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఎంపిక చేయబడిన అటవీ డివిజన్లలో ప్రజల సౌకర్యార్థం రహదారుల నిర్మాణానికి అవసరమైన అనుమతులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. నల్గొండ, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు అటవీ డివిజన్లలో పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణ శాఖలకు సంబంధించి అనుమతుల కొరకు సరైన పత్రాలతో ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు. మంచిర్యాల డివిజన్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో రాచెర్ల నుండి అర్జునగుట్ట మీదుగా వెచల్లి, రొయ్యలపల్లి, సిర్సా, అన్నారం వరకు 7 మీటర్ల వెడల్పుతో 7.4228 హెక్టార్లలలో బిటి రోడ్డు నిర్మాణానికి, నల్గొండ డివిజన్లో బాలన్సింగ్ రిజర్వాయర్, మహబూబాబాద్ డివిజన్లో రహదారి వెడల్పు, బిటి రోడ్లు, ములుగు డివిజన్ పరిధిలో రహదారుల నవీకరణ కొరకు సరైన వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్సింగ్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, రోడ్లు-భవనాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు.





