- మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వినూత్న నిరసన
నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాయి. అనంతరం వినతిపత్రం సమర్పించి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 420 రోజులు పూర్తయిన ఈ రోజున, 420 హామీలతో ప్రజలను మోసం చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు వాస్తవంలో న్యాయం చేయక, అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రోజూ ప్రజలను వంచిస్తున్నాడు” అని విమర్శించారు. రైతులకు వరుస వెన్నుపోట్లు
రైతు భరోసా కింద రూ. 15,000 ఇస్తామని చెప్పి చివరికి రూ. 6,000 మాత్రమే అందించిన విధానాన్ని ఆయన తప్పుబట్టారు. వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టడం, ఎరువులు, విత్తనాల కోసం రైతులు తిరగబడే పరిస్థితిని కాంగ్రెస్ సర్కారు సృష్టించిందని మండిపడ్డారు. “ఈ 420 రోజుల్లో రైతన్నకు ఎదురైన చేదు అనుభవాలు కోకొల్లలు” అని పేర్కొన్నారు. మహిళలకు వెన్నుపోటు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్ మాట్లాడుతూ, “మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఇస్తామని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. పింఛన్లు రూ. 4,000కి పెంచుతామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదు” అని విమర్శించారు. యువత భవిష్యత్తును నాశనం చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కనగండ్ల తిరుపతి మాట్లాడుతూ, “యువతకు 2 లక్షల ఉద్యోగాల హామీని పూర్తిగా విస్మరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకునే నీచ రాజకీయాలకు తెరతీశారు” అని ధ్వజమెత్తారు. “గల్లీ స్థాయి నాయకుల నుంచే కాదు, ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేశారు” అని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్ నేతలు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు రాజయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, నాయకులు గుబిరె మల్లేశం, నలువాల స్వామి, ప్యాక్స్ డైరెక్టర్ దీటి బాలనర్సు, మాజీ దేవస్థానం చైర్మన్ బండారి రాములు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి ఎల. శేఖర్ బాబు, పట్టణ అధ్యక్షులు వంగల నరేష్, యువజన అధ్యక్షులు బిగుల్ల మోహన్ సహా అనేక మంది బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.





