- విజేతలకు బహుమతి ప్రదానం చేసిన ఎమ్మెల్యే వివేక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ఇటీవల ప్రారంభించిన వివి క్రికెట్ టోర్నమెంట్ లో చివరి రోజైన గురువారం చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై, గెలుపొందిన జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. వివి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ఇందారం జట్టుకు ట్రోఫీతో పాటు ముప్పై వేల రూపాయల నగదు బహుమతిగా, అలాగే రన్నరప్ గా నిలిచిన కాన్కూర్ జట్టుకు పదిహేను వేల నగదు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ, నేటి యువతలో సమయస్ఫూర్తి, పరస్పర స్నేహభావం, తాము అనుకున్న గమ్యం చేరడానికి కావలసిన పట్టుదల, సమాజంలో ఉన్నతంగా జీవించే విధంగా గొప్ప ఆలోచనలు రేకెత్తించడానికి, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, అది క్రీడలతో పెంపొందించుకోవాలని, ఐకమత్యంతో కలిసిమెలిసి క్రీడా స్ఫూర్తితో ఆడుకొని, సోదర భావంతో మెలగాలని, తోటి వారితో ప్రేమానురాగలతో జీవించాలని, మత్తు పదార్థాలకు, గొడవలు, జూదం, కొట్లాటలకు దూరంగా ఉండాలని, అమ్మానాన్నలు పెట్టుకున్న కలలను నెరవేర్చే విధంగా ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. గ్రామాల్లో యువతకు క్రీడల పై ఆసక్తి కలిగించేలా వివిధ క్రీడలకు సంబంధించిన టోర్నమెంట్ లను నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. చివరి మ్యాచ్ లో ఉత్కంఠ భరితంగా ఆడిన ఇరుజట్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





