- జిల్లా కలెక్టర్
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జములమ్మ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జములమ్మ బ్రహ్మోత్సవములపై సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఫిబ్రవరి 4 నుంచి 12 వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అందరూ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం దేవాలయానికి ఎక్కువ మంది వస్తారని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. భద్రత ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని, ఆలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించాలని ఈఓ కు ఆదేశించారు. తహశీల్దార్ కు అన్ని శాఖల సమన్వయానికి వాట్స్ యాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమర్థవంతమైన నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఆలయ పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రత్యేక బస్ షెల్టర్ ఏర్పాటుకు ప్రజా ఆరోగ్య ఇంజనీర్ల సహాయంతో చర్యలు తీసుకోవాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై దుకాణదారులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జములమ్మ బ్రహ్మోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రత, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, మెడికల్ క్యాంపులను ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. గద్వాల నుండి ఎర్రవల్లి వరకు అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలి. అక్కడ మాత్రమే డ్రైవర్లు బస్సులు పార్క్ చేయాలని, రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశాలిచ్చారు. రహదారులపై ఉన్న వైన్ షాపుల కారణంగా ఏవైనా సంఘటనలు జరుగకుండా ఉండేందుకు డైవర్షన్ చేసి, అక్కడ బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి. నీటి వద్ద ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఫిబ్రవరి 4 నుంచి 12 వరకు జరిగే బ్రహ్మోత్సవాలు భక్తుల భాగస్వామ్యంతో గొప్పగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, ఈఓ పురేందర్, గద్వాల తహశీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ దశరథ్, ఎక్సైజ్ అధికారి వీరేశ లింగం, సిఐ శ్రీను, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.





