నేటి సాక్షి, మందమర్రి:- ప్రకృతికి విరుద్ధంగా, భూ అంతర్భాగంలో సరైన గాలి వెలుతురు లేక ఎన్నో ఇబ్బందుల్లో పనిచేస్తూ దేశానికి వెలుగునిస్తున్న సింగరేణి కార్మికులు ఆదాయపన్ను పేరా నిలువు దోపిడీకి గురవుతున్నారని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పార్వతి రాజిరెడ్డి, ఏరియా ఉపాధ్యక్షుడు జే శ్రీనివాస్ లు ఘాటుగా విమర్శించారు. శనివారం ఏరియాలోని ఆర్కే ఓసిపి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, బడ్జెట్ డే సందర్భంగా సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు గని కార్మికులు వారి జీవితాలను నలుపు చేసుకొంటున్నారని, వారికి ఐటి నుండి మినహాయింపు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులను సరిహద్దులో సైనికులతో పోల్చుతూ, బొగ్గు గని కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేస్తానని పదేళ్లు మభ్యపెట్టి, అదే బొగ్గు గని కార్మికులు కన్నేర చేస్తే ఓడిపోయారని గుర్తు చేశారు. మారిన ప్రభుత్వంలో సైతం సింగరేణి కార్మికుల పట్ల వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఐటి మాఫీ గురించి ఊసే తీయడం లేదన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం ఆదాయపన్నులో అంకెల గారడీ మాత్రమే మిగిలిందన్నారు. ఎంతమంది కార్మికులు 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారుంటారని ప్రశ్నించారు. 12.75 లక్షలకు టాక్స్ ఉండదు కానీ 13లక్షలు ఉన్న 75 వేల టాక్స్ పడుతుందని, 13 లక్షల ఆదాయం దాటిన వారి టాక్స్ లో పెద్ద మార్పు ఏమి ఉండదని, 80 శాతం సింగరేణి కార్మికులకు ఐటి యధావిధిగా ఉంటుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులందరినీ ఆదాయ పన్ను మినహాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల మూడు నెలల వేతనాన్ని అన్యాయంగా ట్యాక్స్ రూపంలో ప్రభుత్వ లాక్కు ఉంటుందని మండిపడ్డారు. కనీసం కోలిండియా మాదిరి పెర్క్స్ పైన ఆదాయపన్ను రద్దు చేయించడంలో గెలిచిన సంఘాలు సింగరేణిలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా సింగరేణిలో అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి, ఆదాయపన్ను రద్దుకై తీవ్ర ఆందోళన చేసి, కార్మికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల చెమట రక్తాన్ని టాక్స్ రూపంలో తదుపరి జీఎస్టీ రూపంలో ఆదాయాన్ని రెండుసార్లు దాదాపు సగం కంటే ఎక్కువ దోచుకోవడమేంటని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్ర శ్రీనివాస్ రెడ్డి, చొప్పరి రామస్వామి, ప్రభాకర్ లు పాల్గొన్నారు.





