- జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– అత్యవసర వైద్య సేవలు, సికిల్ సెల్, తల సేమియా వ్యాధిగ్రస్తులకు, రక్త నిధి కేంద్రం ద్వారా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాలో అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ నగర్ లో గల రెడ్ క్రాస్ సొసైటీ ఆనంద నిలయం (వృద్ధులు, అనాధ పిల్లల ఆశ్రమం)లో తల సేమియా, సికిల్ సెల్ వార్డ్ నూతన భవన నిర్మాణం కొరకు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ బొప్పు సతీష్ లతో కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, గత 18 సంవత్సరాలుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లాలో ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు, గర్భిణులకు అత్యవసర సేవలు అందించడం, తల సేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించడంలో విశేష సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో తల సేమియా, సికిల్ సెల్ వార్డు నూతన భవన నిర్మాణం పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేసి, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించి, ఔత్సాహికులు స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహించడం జరుగుతుందని, ఈ శిబిరాల ద్వారా సేకరించిన రక్త నిల్వలను అత్యవసర సేవలు అవసరం ఉన్న వారితో పాటు సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు అవసరం నిమిత్తం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి చందూరి మహేందర్, ఎంసి సభ్యులు మధుసూదన్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్, ఉదారి చంద్రమోహన్ గౌడ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





