- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్ లతో కలిసి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సంబంధిత గోడ పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఫిబ్రవరి 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని జరుపుకుంటున్నామని, ఇందులో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన కొరకు ఆల్బెండెన్స్ మాత్రలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్ కళాశాల పిల్లలకు మాత్రలు వేయడం జరుగుతుందని, జిల్లాలోని 910 అంగన్వాడీ కేంద్రాలలో సుమారు 35 వేల మంది పిల్లలు, 749 ప్రభుత్వ పాఠశాలలో 62 వేల 500 మంది పిల్లలు, 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 188 ప్రైవేట్ పాఠశాలలలోని పిల్లలకు మాత్రలు తినిపించడానికి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఐసిడిఎస్., విద్య, కళాశాల విద్య, గిరిజన సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను సమన్వయం చేసుకుంటూ, జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పోషకాహార లోపం, రక్తహీనత, శారీరక, మానసిక ఎదుగుదల లోపం నుండి పిల్లలను కాపాడుకునేందుకు సకాలంలో ఆల్బెండజోల్ మాత్రలు అందించడం జరుగుతుందని, ఈ మాత్రలను బాగా నమిలి శుభ్రమైన త్రాగునీటితో తీసుకోవాలని సూచించారు. వికారం, స్వల్ప కడుపునొప్పి, వాంతులు, విరేచనాల పరిస్థితి నుండి పిల్లలను కాపాడుకునేందుకు ఈ మాత్రలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఆశ, అంగన్వాడి, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, జిల్లా అధికారులు సమన్వయంతో కృషి చేసి నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని తెలిపారు. 1 నుండి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మాత్ర సగభాగం పొడిలా చేసి ఇవ్వాలని, పై వయస్సు గల పిల్లలందరూ ఒక టాబ్లెట్ నమిలి తినేలా వివరించాలని సూచించారు. మాత్ర తీసుకోవడం తప్పిపోయిన పిల్లలకు ఫిబ్రవరి 17న మరల మాత్రలు అందించడం జరుగుతుందని, కార్యక్రమ నిర్వహణ కొరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ అనిత, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.





