నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లాలోని నిరుద్యోగులు, ప్రస్తుతం చదువుతున్న ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ప్రొఫెషనల్ విద్యార్థులకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) వెబ్‌సైట్‌లో నమోదు చేసుకునేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ విసి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అధ్యక్షతన డిట్ పై జిల్లా స్థాయి కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డిజిటల్ ఎంప్లాయ్ మెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) వెబ్‌సైట్‌లో ప్రస్తుతం చదువుతున్న ఐటీఐ పాలిటెక్నిక్, డిగ్రీ విద్యార్థులకు కావలసిన ఇంటర్న్షిప్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులకు కావలసిన అప్రింటిషిప్ ల సమాచారంతో పాటు యువతకు ప్రైవేటు రంగంలో నిరంతర ఉద్యోగ కల్పనకు తోడ్పడుతుందని అన్నారు. నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిలా ఉండేలా డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని అన్నారు. కంపెనీల్లోని ఉద్యోగ అవకాశాలు, అప్రెంటీస్‌షిప్, ఇంటర్న్‌షిప్‌ల వివరాలు దీనిలో అందుబాటులో ఉంటాయని మానుఫ్యాక్చరింగ్, ఐటి, ఫార్మా, అగ్రికల్చర్, మొదలగు రంగాలకు సంబంధించిన ప్రైవేట్ సంస్థల యజమానులు (ఉద్యోగదారులు) నమోదు చేసుకుని నిరుద్యోగులు, డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న వారు ఈ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే, కంపెనీలే నేరుగా ఎంపిక చేస్తాయని, ఇందులో నమోదైన అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని అన్నారు. అభ్యర్ధులకు కంపెనీలే నేరుగా మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ పంపడంతో పాటు కాల్‌చేసి పిలుస్తాయి. ఇందులో తమ ప్రమేయం ఏమీ ఉండదని కంపెనీలే డైరెక్ట్‌గా అభ్యర్థులతో మాట్లాడతాయని కలెక్టర్ తెలిపారు. ఈ డిట్ సెబ్సైట్ ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని నమోదు చేసుకుని నైపుణ్యత ఆధారంగా ఉద్యోగ సమాచారాన్ని పొందేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జిల్లా పరిశ్రమల అధికారి సాల్మాన్ రాజు, డిఆర్డిఓ కౌసల్యాదేవి, జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి సత్యవాణి, యంగ్ వన్ ఇండియా ప్రతినిధి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.





