- ప్రజావాణిలో కలెక్టర్ కు బాధితుడు ఫిర్యాదు
నేటి సాక్షి, జగిత్యాల బ్యూరో : జగిత్యాల జిల్లా సారంగాపూర్ లోని సహకార సంఘం పాలకవర్గం..సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లు చేస్తున్నారని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు సోమవారం ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. సారంగాపూర్ లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గం. సిబ్బంది వ్యవహారిస్తున్న తీరు పట్ల రేచపల్లి గ్రామానికి చెందిన యువకుడు బాస మహేష్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంలో మరల రుణాలు ఇచ్చే క్రమంలో సహకార సంఘంలోని పాలకవర్గం. సిబ్బంది ఇరువురు సమన్వయంతో రైతుకు అసలు విషయం తెలుపకుండానే గోల్ మాల్ వ్యవహారానికి తెరతీశారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.డాక్యుమెంట్ల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా సొంత ఎజెండాతో ఇష్టానుసారంగా రైతు బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు తీసుకున్నారని పేర్కొన్నారు. ఖాతాదారులకు ఎలాంటి సమాచారం లేకుండా ఖాతా నుండి డబ్బులు ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఫోన్ ద్వారా అడిగితే పొంతన లేని జవాబులు చెప్పడంతో అనుమానం వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని క్రాప్ లోన్ తీసుకున్న బాధితుడు తెలిపాడు. సహాకార సంఘంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూ రైతుల ఆర్థిక హక్కులను కాలరాస్తున్న పాలకవర్గం. సిబ్బంది వ్యవహారిస్తున్న తీరు పై క్షేత్రస్థాయి విచారణ చేపట్టి చట్టరీత్యా చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నట్లు బాస మహేష్ చెప్పారు.