సప్త వాహనాలపై కల్యాణ వెంకన్న విహారం
నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి రూరల్ తుమ్మలగుంటలో రథసప్తమి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. తిరుపతి నగరంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా రథ సప్తమి రోజున ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు సప్త వాహనాల్లో భక్తులకు స్వామి వారు కనువిందు చేయనుండడంతో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మంగళవారం ఉదయం స్వామి వారు సూర్యప్రభ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తికి ప్రత్యేక అలంకరణ, దైనందిన పూజాదికాలు నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణలు, కర్పూర హారతుల నడుమ స్వామి వారి వాహన సేవలు కన్నుల పండువుగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి లక్ష్మీ దంపతులు వాహన సేవల్లో పాల్గొని స్వామి వారి మొక్కులు తీర్చుకున్నారు.
- సప్త వాహనాలపై కల్యాణ వెంకన్న విహారం –
ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై స్వామి వారు భక్తులను కటాక్షించారు. ఆ తరువాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనాలపై విహరించిన స్వామి వారు భక్తులకు అభయహస్తంతో ఆశీస్సులు అందించారు. అనంతరం శ్రీవారి ఆలయ పుష్కరణిలో వైఖానస ఆగమోక్తంగా చక్రతాళ్వార్ కు తిరుమంజనం నిర్వహించి చక్రస్నానం ఆచరించారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి స్వామి వారు కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. రథసప్తమి పర్వదినాన సూర్యప్రభ వాహన సేవ తరువాత జరిగిన పుష్కరణిలో సాగిన చక్రస్నానంకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.





