Tuesday, March 17, 2026

సర్పంచ్ ల పెండింగు బిల్లులు వెంటనే చెల్లించాలి

  • బి.ఆర్.ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య

నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్):
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని, పల్లెల సమగ్ర అభివృద్ధి తోనే దేశ ప్రగతి సాధ్యమని బి.ఆర్.ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య అన్నారు. తాజా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులకై పోరాడుతున్న తాజా మాజీ సర్పంచ్ల అరెస్టును తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులకై తాజా మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర కమిటీ ఇచ్చిన “చలో సెక్రటేరియట్” సీఎం ఇల్లు” “మంత్రుల ఇండ్ల ముట్టడి” పిలుపు మేరకు చందుర్తి మండల తాజా మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని సుమారు 5 గంటల పాటు చందుర్తి పోలీస్ స్టేషన్లో ఉంచారు. పోలీసుల అదుపులో ఉన్న తాజా మాజీ సర్పంచ్లకు సంఘీభావం తెలిపిన అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో సర్పంచులు గ్రామాల సర్వతో ముఖాభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు, వైకుంఠధామాలు, అలాగే ప్రతి గ్రామపంచాయతీకి వాటర్ ట్యాంకరు తోపాటు ట్రాక్టర్లను సమకూర్చి నిరంతరం వీధులన్నీ పచ్చదనం పరిశుభ్రతతో నింపారని కొనియాడారు. గ్రామాల్లో సిసి రోడ్లు, కమ్యూనిటీ భవనాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను అప్పులు తెచ్చి మరి అధికారుల పర్యవేక్షణలో పనులు పూర్తి చేశారని, అయినప్పటికీ 14 నెలలుగా బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తుందని విమర్శించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక పలువురు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకోవడం విషాదకరమని విచారం వ్యక్తం చేశారు. తమకు అనుకూలమైన బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం సర్పంచ్ల పై కక్షగట్టి కాలయాపన చేయడం తగదని వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ల ఫోరం జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ దుమ్మ ఆనంద్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ డప్పుల అశోక్, తాజా మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఆయిల్ లేని కమలాకర్ రావు, చిలుక అంజిబాబు, లింగంపల్లి కరుణాకర్, మేకల పరిసరాములు, గట్టు లక్ష్మీనారాయణ, రాపల్లి గంగాధర్, తదితరులు పపాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News