లొంగిపోతే ప్రభుత్వం నుండి ప్రయోజనాలు అందేలా చూస్తాం
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:
మావోయిస్టులు అజ్ఞాతం వీడి, జనజీవన స్రవంతిలో కలిసి, ప్రశాంతమైన జీవితం గడపాలని మావోయిస్టులకు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజి సూచించారు. బుధవారం ఆయన మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, ఐపిఎస్, బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ లతో కలిసి జిల్లాలోని బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో జాడి భాగ్య అలియాస్ పుష్ప, జాడి వెంకటి మావోయిస్టు దంపతుల తల్లి, మల్లమ్మ ను, కుటుంబ సభ్యులను పరామర్శించి, పుష్ప తల్లి మల్లమ్మ తోపాటు కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులను, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి దుప్పట్లు నిత్యవసరుకులను అందజేసి, ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అనంతరం సిపి ఎం శ్రీనివాస్, ఐపిఎస్, ఐజి మాట్లాడుతూ, మావోయిస్టు పార్టీ సభ్యులైన జాడి పుష్ప, జాడి వెంకటి లు 1999 లో అజ్ఞాతంలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు. మావోయిస్టులు వనం వీడి, జనంలోకి వచ్చేలా చూడాలని, లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని, మావోయిస్టు పుష్ప తల్లి మల్లమ్మ, అన్న ఆవుల గంగారాం లను కోరారు. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి, మావోయిస్టు పార్టీలో పనిచేసి వారు సాధించింది శూన్యమని, ఇకనైనా అజ్ఞాతం వీడి జనంలోకి రావాలన్నారు. ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని, అదేవిధంగా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటీవల కాలంలో అనేకమంది మావోయిస్టులు పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. మావోయిస్టులు ఆయుధాలు వీడి, జనజీవన స్రవంతిలో కలిస్తే, వారిపై ఉన్న రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలూద్దీన్, తాళ్ళగురిజాల ఎస్ఐ రమేష్, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.





