Wednesday, March 18, 2026

పోరు కన్నా.. ఊరు మిన్న..

  • వనం వీడి జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలి
  • లొంగిపోతే ప్రభుత్వం నుండి వచ్చే అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తాం
  • జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

నేటి సాక్షి, ఆసిఫాబాద్ :
మావోయిస్టులు వనం వీడి.. జనంలోకి వచ్చేలా కుటుంబ సభ్యులు చూడాలని కొమరం భీమాసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ కోరారు. “పోరు కన్నా ఊరు మిన్న” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పెంచికల్ పేట్ మండలం అగర్ గూడా గ్రామానికి చెందిన మావోయిస్టు సభ్యురాలు చౌదరి అంకు బాయ్ అలియాస్ అనిత కుటుంబ సభ్యులను ఎస్పీ పరామర్శించారు. అంకు బాయ్ కుటుంబ సభ్యుల ప్రస్తుత స్థితిగతులతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు నిత్యావసర సరకులు, దుస్తులు అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వనం వీడి జనంలోకి వచ్చేలా చూడాలని ,లొంగిపోతే ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని కుటుంబ సభ్యులను కోరారు. ఎన్నో ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండి , మావోయిస్టు పార్టీలో పని చేసి సాధించింది శూన్యమని చెప్పారు. ఇకనైనా అంకు బాయ్ అజ్ఞాతం వీడి జనంలోకి రావాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని, ఇవే కాకుండా అజ్ఞాత జీవితం గడుపుతున్న మావోయిస్టులు ఆరోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని, అదేవిధంగా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డ్ పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషిచేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజలు, యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాల కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. గ్రామస్తులకు చీరలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ డీఎస్పీ రామనుజం, రూరల్ సీఐ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ రాణా ప్రతాప్, పెంచికల్ పేట్ ఎస్సై కొమురయ్య, ఆర్ఎస్ఐ ఓదేలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News