Wednesday, March 18, 2026

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్ తో కలిసి జిల్లాలోని మంచిర్యాల పట్టణం సాయి కుంట ప్రాంతంలో గల వెనుకబడిన తరగతుల బాలుర సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి వంటశాల, భోజనం తయారీ విధానం, గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిందని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతోపాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరి గోడ, అదనపు గదులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదివి పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు. శారీరక కార్యకలాపాలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని, విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమంపై నెలవారి పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాల సాధన దిశగా పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి వసతి గృహంలో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి శ్రీహరి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News