- డిఆర్వో వై. వి. గణేష్
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వయో వృద్ధులకు తగిన ప్రాధాన్యతను తప్పని సరిగా ఇవ్వాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేష్ అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి వయోవృద్ధుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి గణేష్ మాట్లాడుతూ వయో వృద్ధులను గౌరవించడం, వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో వయో వృద్ధులను ప్రాధాన్యత, ప్రత్యేక సేవలను అందించాలన్నారు. ప్రతి గురువారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఓపీ సేవలను అందించాలన్నారు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేటప్పుడు వయో వృద్ధులకు కేటాయించిన సీట్లలో వారే కూర్చునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. బ్యాంకుల లో కూడా వయో వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన్ , ప్రాధాన్యత తో కూడిన సేవలను అందించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ క్షమా దేశ్ పాండే మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వయో వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం -2007 పై ప్రత్యేక అవగాహన సదస్సులను జిల్లా మండల స్థాయిలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వయో వృద్ధుల కోసం ఉచిత న్యాయ సేవలను సంస్థ ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వయో వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి, జిల్లా ఆసుపత్రుల నిర్వహణ అధికారి డాక్టర్ గౌతమ్ చౌహన్, ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ ఇక్తార్ అహ్మద్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ రవి కృష్ణ, వయో వృద్ధుల జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ అనితారెడ్డి, తీరాల యుగేందర్ దామెర నరసయ్య కొండ బత్తుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.





