- బిజెపి నేత రఘునాథ్ వెరబెల్లి
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై బిజెపి పార్టీని ఓడగొట్టాలని చూస్తున్నాయని బిజెపి నాయకుడు రఘునాథ్ వెరబెల్లి ఆరోపించారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని బిజెపి పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ యువతను, ఉపాధ్యాయులను మోసం చేస్తే, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గత 14 నెలల నుండి యువతను, నిరుద్యోగ యువతను, ఉపాధ్యాయులను మోసం చేస్తుందని విమర్శించారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను, రైతు కూలీలను, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అందించక పేద ప్రజలను, 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో యువతను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఎద్దేవా చేశారు. అదే విధంగా అటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ అందించకుండా, ఇటు ఉద్యోగులను, ఉపాధ్యాయులను సైతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జిఓ నెంబర్ 317 కు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల తరపున పోరాటం చేసిన పార్టీ బిజెపి మాత్రమే అని గుర్తు చేశారు. 317 జిఓ పై పోరాడి అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలుకు సైతం వెళ్లారన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగ యువత పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఘనత బీజేపీ పార్టీదే అని తెలిపారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, నిరుద్యోగ యువతకు అండగా ఉండి, వారి తరపున పోరాటం చేసే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు. జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి, బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు అయ్యి బీజేపీ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, వచ్చే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల కుట్రలు తిప్పికొట్టి, బీజేపీ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అన్ని విధాలుగా పట్టభద్రులకు, నిరుద్యోగ యువతకు, ఉపాధ్యాయులకు బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్గం అశోక్, పత్తి వెంకట కృష్ణ, ఎనగందుల కృష్ణ మూర్తి, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, మాధవరపు వెంకట రమణ రావు, అమిరిశెట్టి రాజ్ కుమార్, సత్రం రమేష్, గడ్డం స్వామి రెడ్డి, కర్రె లచ్చన్న, బొద్దున మల్లేష్, గాదె శ్రీనివాస్, బింగి ప్రవీణ్, మెరెడిగొండ శ్రీనివాస్, మెట్టుపల్లి జయరామరావు, కర్రె చక్రవర్తి, ఆర్నకొండ శ్రీనివాస్, రావణవేణి శ్రీనివాస్, నాగుల రాజన్న, దేవరకొండ వెంకన్న, కొండ వెంకటేష్, చిరంజీవి, చల్లా విక్రమ్, సదయ్య, దుర్గా ప్రసాద్, తరుణ్ సింగ్, కట్కూరి తిరుపతి, ఎల్కపల్లి పవన్, మహేష్ లు పాల్గొన్నారు.





