- మాయం అవుతున్న మట్టి గుట్టలు, వరద కాలువ కట్టలు
నేటి సాక్షి, మెట్ పల్లి (నరేష్ దులూరి) : అక్రమార్కుల తాకిడికి గుట్టలు, వరద కాలువ కట్టలు కనుమరుగవుతున్నాయి. మెట్ పల్లి మండలం లోని చెర్లకొండాపూర్ ఒడ్డెర కాలనీ వద్ద వున్నా గుట్ట నుండి, అదే విధంగా సత్తక్కపల్లి, రాజేశ్వర్ రావుపేట, విట్టంపేట శివారులోని వరద కాలువ నుంచి రాత్రి వేళల్లో మొరం యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. అభివృద్ధి మాటున అక్రమార్కులు మొరం మట్టిని తరలించుకు పోతున్నారు. గుట్టలు, ప్రభుత్వ భూములు, వరద కాలువ కట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నా.. సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.తవ్వకాలు జరుగుతుండంతో పకృతి సంపదకు చెందిన విలువైన గుట్టలు మాయం అవుతున్నాయి. ఈ తవ్వకాలకు నాయకుల అండదండలు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. విలువైన ప్రకృతి సంపదను అడ్డగోలుగా అక్రమార్కులు కొల్లగొడుతుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం గండి కొడుతున్నారు. మెట్ పల్లి తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో వెంచర్లకు మొరం అడ్డగోలుగా తరలించుకు పోవడంతో దశలవారీగా గుట్టలు, వరద కాలువ కట్టలు పూర్తిగా కరిగిపోయే పరిస్థితి తయారైంది. గుట్టల ప్రాంతాల్లో పెద్దపెద్ద బండరాళ్లతో పాటు భారీ స్థాయిలో లోతైన గుంతలు దర్శనమిస్తున్నాయి. వరద కాలువ నుంచి రాత్రి వేళల్లో యదేచ్చగా టిప్పర్ లతో తరలిస్తున్నారు. సంబంధిత అధికారులు, పోలీస్, రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు స్పందించి మొరం అక్రమ రవాణా ను అరికట్టాలని డిమాండ్ వినిపిస్తుంది.





