- ఘనంగా ఎంపీ జన్మదిన వేడుకలు
- రక్తదానం చేసిన కాంగ్రెస్ నేతలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతకు ఉపాధి తో పాటు కార్మికుల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని హైటెక్ సిటీలో గల చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నివాసంలో సోమవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు.

అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు రక్తం లేక ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ గడ్డం వంశీకృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా, స్పందించిన ఆయన వెంటనే రక్తదానం శిబిరం నిర్వహించాలని పిలుపునివ్వడంతో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియా, యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారని తెలిపారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇదే విధంగా మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియా, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.