- జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– స్థానిక సంస్థలు ఎన్నికలు రానున్న సందర్భంగా ఎన్నికల ప్రక్రియ, విధుల నిర్వహణపై అధికారులు, సిబ్బందికి అందిస్తున్న, నేర్చుకున్న అంశాలను, భారత ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి తూచా తప్పకుండా ఆచరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కల్పన, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం నాయక్ లతో కలిసి స్టేజ్-1, 2 ఆర్ఓలు, స్టేజ్-1 ఏఆర్ఓ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి, హ్యాండ్ బుక్ నిర్వహణ, ఎన్నికల ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ, రాబోవు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపిటిసి, జెడ్పిటిసి స్థానిక సంస్థల ఎన్నికలలో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, ఈ క్రమంలో అందిస్తున్న శిక్షణను ఏకాగ్రత్తతో నేర్చుకోవాలని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి గడువు ముగిసేంత వరకు అధికారులు, సిబ్బందికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలో నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సర్పంచ్, ఎంపిటిసి స్థానాలకు గులాబి రంగు బ్యాలెట్ పేపర్, జెడ్పిటిసి, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలలో భాగంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, జోనల్, ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్, సహాయకులు ఇతర సిబ్బందిని నియమించడం జరుగుతుందని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఫారాలు, కవర్లు, పోలింగ్ సామాగ్రి అవసరమైన మేరకు సమకూర్చడంతో పాటు అదనంగా అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ తో వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎన్నికల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





